News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

జనసైనికుల దెబ్బకు అకౌంట్ లేచిపోయింది

సోషల్ మీడియా పవర్ ఏంటో చెప్పడానికి ఇది మరో రుజువు. అదే సమయంలో సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలితే ఎంత నష్టమో చెప్పడానికి కూడా ఈ ఉదంతాన్నే ఉదాహరణగా చెప్పొచ్చు. టీవీ చర్చల్లో బలంగా వాయిస్ వినిపిస్తూ, ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని దునుమాడుతూ పాపులారిటీ సంపాదించి భారతీయ జనతా పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడైన విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బ గట్టిగా రుచి చూశాడు.

ఈ మధ్య ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను గట్టిగా విమర్శించాడు. ఏపీలో ఇసుక సంక్షోభం మీద పవన్ పార్టీ చేయబోయే ర్యాలీ గురించి కూడా విమర్శలు గుప్పించాడు. ఇది తెలుగుదేశం పార్టీ మద్దతుతో జరుగుతున్న ర్యాలీ అని.. ఇందులో తాము పాల్గొనబోమని అన్నాడు. పవన్‌కు విలువల్లేవని.. నైతికత లేదని.. ఇలా ఏవేవో విమర్శలు చేశాడు.

ఐతే ఎవరు పడితే వాళ్లు పవన్‌ను విమర్శిస్తే జనసైనికులు చూస్తూ ఊరుకుంటారా? ఈ విష్ణువర్ధన్ సంగతేంటో చూద్దామని అతడి ట్విట్టర్ అకౌంట్ లోతుల్లోకి వెళ్లారు. అక్కడే విష్ణు దొరికిపోయాడు. కొన్నేళ్ల కిందట మరీ నాటుగా ఉండే చాలా ట్వీట్లు వేశాడు విష్ణు. సమీరా రెడ్డి గ్లామర్‌ను వేడిమీదున్న కుర్రాడిలా పొగడ్డం.. ఒక సామాజిక వర్గానికి చెందిన హీరోల మీద విషం కక్కడం.. తన సామాజిక వర్గం హీరోల్ని ఆకాశానికెత్తేయడం.. ఇంకా విష్ణు ట్విట్టర్ అకౌంట్లో ఆణిముత్యాల్లాంటి ట్వీట్లు వందల్లో ఉన్నాయి. వీటన్నింటినీ జనసైనికులు బయటికి తీశారు. కొన్ని గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో రొచ్చు ట్వీట్లు బయటికి వచ్చాయి. ట్విట్టర్లో విష్ణు పరువంతా గంగలో కలిసిపోయింది.

- Advertisement -

ఐతే దీనిపై స్పందించకుండా ఉన్నా పోయేది. కానీ విష్ణు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఒక కవర్ డ్రైవ్ ఆడాడు. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఈ అకౌంట్ వేరెవరో మెయింటైన్ చేస్తున్నారని.. అది ఇంకెవరి వద్దకో వెళ్లిందని… ఇందులోని ట్వీట్లు తనవి కావని అన్నాడు. కానీ నిన్న మొన్నటిదాకా ఇదే అకౌంట్ నుంచి ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా అధికారిక ట్వీట్లు వేసింది విష్ణునే. ఇప్పుడేమో ఆ అకౌంట్ తనది కాదన్నాడు.

ఇలా చెప్పడానికి ముందు జనసైనికులు వెలికి తీసిన ట్వీట్లన్నింటినీ విష్ణు డెలీట్ చేసుకుంటూ పోవడం.. చివరికి ఆ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకోవడం గమనార్హం. మొత్తానికి ఏదో ఒక స్టాండ్ మీద ఉండలేక జనసైనికుల దెబ్బకు కక్కలేక మింగలేక బాగా ఇబ్బంది పడిపోయాడు విష్ణు. ఈ వ్యవహారంలో పూర్తిగా పరువు పోగొట్టుకున్న ఆయన.. పార్టీ పెద్దల ఆగ్రహానికి గురై పదవి కూడా కోల్పోయినా ఆశ్చర్యం లేదేమో.
Tags: Social Media, Vishnu Vardhan Reddy, BJP, Janasena, Pawan Kalyan

Leave A Reply

Your email address will not be published.