Chandrayaan-3 landed

అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ సరికొత్త చరిత్ర

జయహో భారత్ - చంద్రుడిపై అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 - 

ఇంటర్నేషనల్ రిపోర్ట్- యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణం ఆనందకరమైంది. మరీ ముఖ్యంగా మొత్తం 140 కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపింది. బుధవారం సాయంత్రం సరిగ్గా 5.44 గంటల సమయంలో విక్రమ్ ల్యాండర్‌ (Vikram Lander) మాడ్యూల్‌, ల్యాండింగ్‌ ను నిర్దేశించిన ప్రాంతానికి సురక్షితంగా చేరుకుంది. ఈ క్రమంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో.. ల్యాండింగ్‌ మాడ్యూల్‌ కు ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ సీక్వెన్స్‌ (ALS) కమాండ్‌ ను పంపించింది. ఈ కమాండ్‌ ను అందుకున్న విక్రమ్ ల్యాండర్‌ మాడ్యూల్‌.. తన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను మొదలుపెట్టింది.

తన నాలుగు థ్రాటల్‌ బుల్‌ ఇంజిన్లను మండించి క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటూ.. రఫ్‌ బ్రేకింగ్‌ దశను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకుని చంద్రుడి దక్షిణధృవ ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. ఈ వెంటనే విక్రమ్ ల్యాండర్‌ మాడ్యూల్‌ తన దిశను మార్చుకుంటూ మెల్లిగా క్రిందకు దిగుతూ వచ్చింది.  ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా (LPDC), కేఏ బ్యాండ్‌ అండ్‌ లేజర్‌ బేస్డ్‌ ఆల్టీమీటర్లు, లేజర్‌ డాప్లర్‌ వెలోసీమీటర్‌ వంటి సాధనాలతో చంద్రుడి ఉపరితలంపై తన గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఆ తరువాత మెల్లగా దశల వారీగా చందమామ ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. ఆఖరికి ల్యాండింగ్‌ కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని సక్సెస్ ఫుల్ గా చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది.

అంతరిక్ష రంగంలో శక్తివంతమైన దేశాలుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందని ద్రాక్ష చంద్రుడి దక్షిణ ధృవం. అలాంటి క్లిష్టతరమైన ప్రాంతంలో చంద్రయాన్-3 (Chandrayaan-3) వ్యోమనౌకను సురక్షితంగా దించి భారతదేశం సరికొత్త రికార్డును సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా అవతరించింది మన ఇండియా. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జులై 14న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota) నుంచి ప్రయోగించిన ఎల్‌వీఎం3-ఎం4 ఉపగ్రహం విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. ఆ మరుసటి రోజు మొదటిసారి దీని కక్ష్యను పెంచారు. అలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా మొత్తం ఐదు సార్లు చంద్రయాన్-3 కక్ష్యను పెంచారు.  ఆగస్టు 1న ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య లోకి ప్రవేశపెట్టి.. అక్కడి నుంచి ఆగస్టు 5న సక్సెస్ ఫుల్ గా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ జాబిల్లికి చేరువ చేస్తూవచ్చారు.

ఆగస్టు 17న ఈచంద్రయాన్-3 (Chandrayaan-3) వ్యోమనౌకలోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ (Pragyan Rover) తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి సక్సెస్ ఫుల్ గా విడిపోయింది. ఆ తరువాత ల్యాండర్ మాడ్యూల్ సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. ఆ తర్వాత రెండు సార్లు డీ అర్బిట్‌ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్‌ ను చందమామ ఉపరితలానికి మరింత చేరువ చేశారు. పదిహేనేళ్ల క్రితమే చందమామపై నీరుందని కనిపెట్టిన భారత్ ఇప్పుడు చంద్రయాన్‌-3తో చంద్రుడి దక్షిణధృవంపైకి ఎవరూ వెళ్లని దారుల్లో వెళ్లి.. ప్రపంచానికి తన సత్తా ఎంటో చూపించింది. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు చంద్రయాన్-3 (Chandrayaan-3) ల్యాండర్‌ చంద్రుడిపై విజయవంతంగా కాలుపెట్టి.. భారత సాంకేతిక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచంలోని అగ్రదేశాలన్ని భారత్ వైపు చూసేలా చేసింది మన ఇస్రో. జయహో ఇస్రో.. జయహో భారత్. chandrayaan 3 successfully landed on moon
 


Comment As:

Comment (0)