Jagan Sharmila

జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకాలు

వైఎస్ జగన్.. షర్మిల మధ్య సయోధ్య కుదిర్చిన స్టాలిన్, డీకే శివకుమార్

స్పెషల్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan), ఆయన చెల్లెలు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ల మధ్య సయోధ్య కుదిరిందన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత కొన్నాళ్లు సఖ్యతగానే ఉన్న అన్నా చెల్లెళ్లు.. ఆ తరువాత ఆస్తుల వివాదాలతో దూరమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల సొంతంగా తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఐతే గత కొన్నేళ్లుగా జగన్, షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల వివాదాలకు తెరపడినట్లు చర్చ జరుగుతోంది.

వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తి తగాదాలను రెండు రాష్ట్రాలకు సంబందించిన ముఖ్య నాయకులు మధ్యవర్తిత్వం వహించి మరీ పరిష్కరించారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్పి స్టాలిన్ (CM Stalin), కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) మధ్యవర్తులుగా  జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకాలు జరిగాయని తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ పక్షాన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, షర్మిల పక్షాన కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ ఉండి ఆస్తులను పంచారని విశ్వసనీయవర్గాల సమాచారం. అందులో ప్రధానంగా తెలంగాణలో వైఎస్ కుటుంబానికి ఉన్న భూములు, భవనాల పంపకాలపై జగన్, షర్మిల మధ్య రాజీ కుదిరిందని తెలుస్తోంది. ఆస్తుల పంపకాలతో వైఎస్ షర్మిల సంతృప్తి గా ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ జోక్యంతో అన్నాచెల్లెల ఆస్తి గొడవలకు తెరపడినట్టేనని అంటున్నారు. అన్నతో ఉన్న ఆస్తుల పంపకాల వివాదానికి తెరపడటంతో వైఎస్ షర్మిల ఏపీ, తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. షర్మిల ఆంధ్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండా వైఎస్ జగన్ పావులు కదిపారని తెలుస్తోంది. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత ఏపీ, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు షర్మిల సేవలను ఉపయోగించుకోనుందట కాంగ్రెస్ పార్టీ. అదన్న మాట సంగతి.


Comment As:

Comment (0)