Tamilisai Soundararajan

ప్రొటోకాల్ ఇవ్వకపోయినా నా పని నేను చేసుకుంటూ పోతా

రక్తంతో నా చరిత్ర పుస్తకం రాసుకుంటా- గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ రిపోర్ట్- మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan). తాను గతంలో బీజేపీ అధ్యక్షురాలినని బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు గవర్నర్ తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు. ఒకప్పుడు తాను బీజేపీ నేతనని ఇప్పుడు గవర్నర్‌ నని చెప్పుకొచ్చారు. రాజకీయాలపై ఇష్టం వల్లే వైద్య వృత్తికి దూరంగా ఉన్నానని చెప్పిన గవర్నర్.. రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువని కామెంట్ చేశారు. తాను తెలంగాణ గవర్నర్‌గా వచ్చినప్పుడు ఒక్క మహిళా మంత్రి కూడా లేరని గుర్తు చేసిన తమిళిసై.. గవర్నర్‌గా వచ్చాక ఇద్దరు మహిళలు మంత్రులచేత ప్రమాణం చేయించానని అన్నారు.

తనపై పువ్వులు వేసే వారతో పాటు రాళ్లు వేసే వారున్నారన్న గవర్నర్.. తనపై రాళ్లు వేస్తే వాటితో భవంతి కడతానని అన్నారు. తనపై పిన్స్‌ వేస్తే.. ఆ పిన్స్‌ గుచ్చుకుని వచ్చే రక్తంతో నా చరిత్ర పుస్తకం రాసుకుంటానని చెప్పారు. మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలని.. తాను ఎలాంటి అవమానాలు పట్టించుకోనని.. ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు గవర్నర్‌ తమిళిసై. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కృతజ్ఞత సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ప్రధాని మోదీకి ఆమె ధన్యవాదాలు చెప్పారు.

 


Comment As:

Comment (0)