CM Jagan

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో సీఎం జగన్

అమరావతి-న్యూ ఢిల్లీ- ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. లోకసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్తే తాను కూడా ఆంధ్రప్రదేశ్ లో శాసనసభను రద్దు చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith Shah)కు జగన్ చెప్పినట్లు సమాచారం. ఈ యేడాది చివరి నాటికి  షెడ్యూల్ ప్రకారం రాజస్థాన్, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల తరువాత మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 14 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభతో పాటు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్, మేలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపే అవకాశం ఉందని ఢిల్లీలో జోరుగా చర్చ జరుగుతోంది. జనవరి చివరి మాసం నుంచి మార్చి ఆఖరుకు మధ్యలో లోక్‌సభ ఎన్నికలతో పాటు 14 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

మరోవైపు నవంబరు లేదంటే డిసెంబర్‌ లో ఎన్నికలు జరిగే తెలంగాణ, రాజస్థాన్. ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించేలా అవసరమైన న్యాయ పరమైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ నిబంధనలు, ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణకు సంబంధించిన అంశాలను పార్లమెంట్‌ లో తీసుకువచ్చే అవకాశం ఉందని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ సైతం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Comment As:

Comment (0)