CM TS Revanth Reddy

బీఆర్ఎస్-బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు

మా ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదిలించలేరు – సీఎం రేవంత్

పెద్దపల్లి-కరీంనగర్ రిపోర్ట్- బీజేపీ దేశంలో రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఆరోపించారు. అందుకే ఈ లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని చూస్తోందని ఆయన చెప్పారు. బీజేపీ దేశంలో దళితుల హక్కులను కాలరాయాలని చూస్తోంది.. పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లకు పోటు తప్పదని ప్రజలను హెచ్చరించారు. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందన్న రేవంత్ రెడ్డి.. రాహుల్‌ గాంధీని ప్రధాని చేస్తేనే మేలు జరుగుతుందని ఓటర్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతర సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

ఇక బ్రిటిష్‌ పరిపాలన టైంలోను ప్రతి పదేళ్లకోసారి దేశంలో జనగణన చేపట్టారన్న రేవంత్ రెడ్డి.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో జనగణన చేయలేదని గుర్తు చేశారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పెద్ద కుట్ర దీని వెనుక దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జనగణనతో పాటు కులగణన డిమాండ్‌నూ ప్రధాని మోదీ సర్కారు పట్టించుకోలేదని విమర్శించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీని బీసీలు కలిసిి తమ జనాభాకు తగ్గట్టుగా విద్యా అవకాశాలు, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

ఈ సారి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణనతో పాటు రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని రాహుల్‌ గాంధీ భావించారని రేవంత్ చెప్పారు. దేశంలో కులగణన, జనగణన జరిగితే నిధులివ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇక దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెబుతోంటే ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు కేటీఆర్‌ చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేసీఆర్ లది ఒక్కటే నినాదమన్న రేవంత్.. 2022 ఫిబ్రవరిలో కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని కేసీఆర్‌ అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ సైతం అదే విధానంతో ముందుకెళ్తోందని రేవంత్ అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరెవరో ఏదో చేస్తామంటున్నారని.. కానీ ఏమీ చేయలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన రేవంత్.. అంగుళం మందం కూడా ఎవరూ కదిలించలేరని కామెంట్ చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి.. భుజాలు కాయలు కాసేలా జెండా మోసి.. రాష్ట్రంలో పార్టీని అధికారాన్ని తీసుకొచ్చారన్న రేవంత్.. ప్రభుత్వానికి ఏమైనా అయితే ఊరుకోరని హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కులేదని అన్నారు.


Comment As:

Comment (0)