Jailer Review

రజనీకాంత్ జైలర్‌ మూవీ ఎలా ఉందంటే..

జైలర్‌.. రజనీకాంత్‌ మూవీ రివ్యూ

మూవీ రిపోర్ట్- సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) సినిమా అంటే కేవలం తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగు, కన్నడం అంటూ భాషతో సంబంధం లేకుండా ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం వచ్చిన పెద్దన్న సినిమా తర్వాత రజనీకాంత్ నుంచి మరో సినిమా రాలేదు. ఇదిగో ఇటువంటి సమయంలో కేవలం మూడు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించిన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dilipkumar) కు అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు రజనీకాంత్. ఇంతకీ జైలర్‌ లో రజనీకాంత్ పాత్ర ఏంటి? ఆయన తన శత్రువులపై పోరాటం ఏ కారణంతో చేయాల్సి వచ్చింది? తలైవా అభిమానులు ఆశించే ఏయే అంశాలు జైలర్ లో ఉన్నాయి? (Jailer movie review) 

సినిమా-  జైలర్‌ (Jailer)
తారాగణం- రజనీకాంత్‌, మోహన్‌ లాల్‌, జాకీ ష్రాఫ్‌, శివరాజ్‌ కుమార్‌, సునీల్‌, రమ్యకృష్ణ, వినాయకన్‌, మిర్నా మేనన్‌, తమన్నా, యోగిబాబు తదితరులు. 
మ్యూజిక్- అనిరుధ్‌ రవిచందర్‌ 
సినిమాటోగ్రఫీ- విజయ్‌ కార్తిక్‌ కణ్ణన్‌ 
ఎడిటింగ్‌- ఆర్‌.నిర్మల్‌
నిర్మాత- కళానిధి మారన్‌ 
రచన, దర్శకత్వం- నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ 
రిలీజ్-  10-08-2023
(Jailer Movie Review)

జైలర్ కధ.... (Jailer Movie Review)
జైలర్ కధలోకి వెళ్తే... ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్య‌న్ (ర‌జ‌నీకాంత్‌) ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. నీతి, నిజాయ‌తీగా ప‌నిచేసిన ఆయ‌న గురించి బాగా తెలిసిన‌వాళ్లు టైగ‌ర్ అని పిలుస్తుంటారు. త‌న  భార్య (ర‌మ్య‌కృష్ణ‌),  ఏసీపీగా ప‌నిచేస్తున్న కొడుకు అర్జున్‌, మ‌న‌వ‌డితో కలిసి హాయిగా కాలం గడుపుతుంటాడు పాండ్యన్. నేర‌స్తుల‌ ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌నే పేరున్న అర్జున్ ప‌నితీరుని చూసి త‌నలాగే త‌న కొడుకు నీతి నిజాయ‌తీల‌తో ప‌నిచేస్తున్నాడ‌ని గ‌ర్వంగా ఫీల్ అవుతుంటాడు. ఈ క్రమంలో విగ్ర‌హాల దొంగ‌ ముఠా నాయ‌కుడైన వ‌ర్మ (వినాయ‌క‌న్‌) పని వల్ల ముత్తువేల్‌ పాండ్యన్ ఫ్యామిలీకి తీరని అన్యాయం జరుగుతుంది. ఆ విష‌యాన్ని పోలీసులు కూడా బ‌య‌ట పెట్ట‌లేని ప‌రిస్థితి. అంత‌టితో ఆగ‌కుండా ముత్తువేలు కుటుంబాన్ని మొత్తం అంతం చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు వ‌ర్మ‌. త‌న ఫ్యామిలీకి ప్రమాదం పొంచిఉందని తెలుసుకున్న ముత్తువేల్ పాండ్యన్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు?  అతి భయంకరమైన మ‌న‌స్తత్వమున్న వ‌ర్మ‌ని ముత్తు ఏం చేశాడన్నది సినిమాలోనే చూడాలి.

ఇంకతీ జైలర్ ఎలా ఉంది... (Jailer Movie Review)
ప్ర‌తీకార నేప‌థ్యం, మాఫియా, కుటుంబ అంశాల కలగోలుపుగా అల్లుకున్న ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి క‌థ ఇది. ర‌జ‌నీకాంత్ మార్క్ మాస్ స్టైల్‌,  హీరోయిజమే ప్ర‌ధానంగా సాగుతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే తలైవా వ‌న్‌ మ్యాన్‌ షో జైలర్. సినిమాలో పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డానికి స‌మ‌యం తీసుకున్న డైరెక్టర్, ఆ త‌ర్వాత మెల్లగా అస‌లు క‌థ‌ని చెప్పడం ఆరంభించాడు. ఇంట్లో ప‌నులు చూసుకునే రిటైర్డ్ పోలీస్ అధికారిగా, మనవడికి తాతయ్యగా ర‌జ‌నీకాంత్‌ ని చాలా సింపుల్ గా ప‌రిచ‌యం చేశాడు దర్శకుడు. ర‌జ‌నీకాంత్, యోగిబాబుల మ‌ధ్య కామెడీ ట్రాక్ న‌వ్వులు పూయిస్తుంది. ఫస్టాప్ లో అర్జున్ మిస్సింగ్ త‌ర్వాతే అస‌లు క‌థ ప్రారంభమవుతుంది. త‌న కొడుకు ఆచూకీ కోసం ముత్తువేలు పాండ్యన్‌ రంగంలోకి దిగాక ఎదుర‌య్యే ప‌రిణామాలు ప్రేక్షకుడిలో ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ఓ వైపు కొడుకు మ‌ర‌ణానికి కార‌ణ‌మైనవాళ్ల‌ని అంతం చేస్తూనే, మ‌రోవైపు ఫ్యామిలీని కాపాడుకునేందుకు పాండ్యన్ చేసే ప్ర‌య‌త్నాలు అందరిని కట్టిపడేస్తాయి. ఇంటర్వెల్ కు ముందు వ‌చ్చే ఫైట్ సీన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పకతప్పదు.

(Jailer Movie Review)
సెకండాఫ్‌ అనుకున్న‌ట్టుగానే  మొద‌లైనా ఆ త‌ర్వాతే క‌థ అనూహ్యంగా  సైడ్ ట్రాక్ పట్టినట్లు అనిపిస్తుంది. ర‌జ‌నీకాంత్ ఫ్లాష్‌ బ్యాక్ స‌న్నివేశాలు సైతం అంత‌గా ఆకట్టుకునేలా లేవు. ఐతే ప్రీ క్లైమాక్స్‌కి ముందు వ‌చ్చే ట్విస్ట్ త‌ర్వాత మ‌ళ్లీ కధ ట్రాక్ లో పడుతుంది. మోహ‌న్‌లాల్‌, జాకీష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌ ల అతిథి పాత్ర‌లు సినిమాకి ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఫస్టాఫ్ తో పోలిస్తే  సెకండాఫ్ అంతంత మాత్ర‌మే అనిపించినా, ర‌జ‌నీకాంత్ త‌న‌దైన న‌ట‌న‌తో సినిమాని గట్టెక్కించారు.

ఎవరెలా చేశారంటే... (Jailer Movie Review)
ర‌జ‌నీకాంత్‌ (Rajinikanth) జైలర్ లో అంతా తానై కనిపింతాడు. తాత‌య్యగా తెల్ల‌టి జుట్టు, గెడ్డంతోనే తెర‌పై క‌నిపించినా కూడా.. త‌న మార్క్ మాస్ అంశాలు ఎక్క‌డా త‌గ్గ‌కుండా జాగ్రత్త పడ్డారు. రజనీకాంత్ స్టైల్‌,  హీరోయిజం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయని చెప్పాలి. తండ్రీ కొడుకుల క‌థ కావ‌డంతో క్లైమాక్స్ స‌న్నివేశాల్లో కట్టిపడేసే భావోద్వేగాల్ని పండించారు. మాథ్యూగా మోహ‌న్‌ లాల్, న‌ర‌సింహ‌గా శివ రాజ్‌కుమార్‌ తెర‌పై చేసిన సంద‌డి సినిమాకి హైలెట్. జాకీష్రాఫ్ పాత్ర చిన్న‌దే. ర‌మ్య‌కృష్ణ గృహిణిగా కాసేపు క‌నిపించారు. ఇక వినాయ‌క‌న్ విల‌నిజం సినిమాకి హైలైట్‌ అని చెప్పాలి. సునీల్‌, త‌మ‌న్నాల ట్రాక్ కాసేపు న‌వ్విస్తుంది. సాంకేతికపరంగా జైలర్ ఉన్న‌తంగా ఉంది. అనిరుధ్ నేప‌థ్య సంగీతం సినిమాకి మరో లెవల్ కు తీసుకెళ్లింది. తెలిసిన రివేంజ్ తో కూడుకున్న క‌థే అయినా, అనూహ్య  మ‌లుపుల‌తో ర‌జ‌నీకాంత్ శైలికి త‌గ్గ‌ట్టుగా మ‌లిచిన నెల్స‌న్ ద‌ర్శ‌కుడిగా మంచి ప్ర‌తిభ చాటుకున్నారు. (Jailer movie review in telugu) 

ర‌జ‌నీకాంత్, ప్ర‌థ‌మార్ధం, సంగీతం, హాస్యం, విరామ స‌న్నివేశాలు జైలర్ కు బలాలైంతే... తెలిసిన క‌థే కావడం, ద్వితీయార్థంలో కొన్ని స‌న్నివేశాలు బలహీనతలుని చెప్పవచ్చు. రజనీకాంత్ అభిమానులుకు మాత్రం జైలర్ ఉర్రూతలుగిస్తుంది.

నోట్- ఇది కేవలం వ్యక్తి అభిప్రాయం మాత్రమే.
(Jailer Movie Review)


Comment As:

Comment (0)