CM Revanth Asifabad

బీజేపీకి ఓటు వేస్తే దేశంలో రాజ్యాంగాన్ని మార్చేస్తారు - సీఎం రేవంత్‌ రెడ్డి

అదిలాబాద్ రిపోర్ట్- దేశంలో రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పుపై మాట్లాడుతున్నానన్న కారణంతోనే తనపై కేసులు పెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో తనపై సుమారు 200 కేసులు పెట్టినా తాను భయపడలేదని, అలాంటిది ప్రధాని మోదీ నన్ను బెదిరించగలరా అని ప్రశ్నించారు రేవంత్. దిల్లీ సుల్తాన్‌లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని, వారి ఆటలు ఇక్కడ సాగనివ్వబోనని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డే ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి.. బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు.   

ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ (Asifabad) లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌ మాట్లాడారు. పోడు భూముల సమస్యలపై కేసీఆర్‌ దృష్టి పెట్టలేదన్న రేవంత్.. కేంద్ర మంత్రివర్గంలో గోండులకు బీజేపీ స్థానం ఇవ్వలేదని అన్నారు. మొదటిసారి ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ను మహిళకు కేటాయించామని చెప్పిన సీఎం.. ఆదిలాబాద్‌ లో సీసీఐ మూతపడినా.. కేసీఆర్, మోదీ పట్టించుకోలేదని మండిపడ్డారు. మోదీ కేంద్రంలో, కేసీఆర్‌ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నా ఆదిలాబాద్‌ కు ఏమీ చేయలేదని విమర్శించారు. తెలంగాణలో బలహీనవర్గాల కులగణన చేస్తున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి.. అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలుగుతామని అన్నారు.

ఐతే దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోందని రేవంత్ ఆరోపించారుకేవలం రిజర్వేషన్లు రద్దు చేయాలనే అజెండాతోనే 2021లో జనగణన చేయలేదని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేయాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ కావాలన్న రేవంత్.. 50 శాతం రాష్ట్రాలు ఒప్పుకోవాలని చెప్పారు. అందుకోసమే దేశంలో 8 రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలను మోదీ పడగొట్టారని ఫైర్ అయ్యారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి.. రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేయాలని బీజేపీ కుట్రపన్నుతోందన్నారు.

 


Comment As:

Comment (0)