Drug Woman

నైజీరియన్ల చేతిలో మోసపోయిన మహిళ 

10 కోట్లు ఆశ చూపి.. ఇంజినీరింగ్ చదువుకున్న మహిళను డ్రగ్‌ స్మగ్లర్‌గా మార్చి.. 

క్రైం రిపోర్ట్- త్వరగా డబ్బు సంపాదించాలని ఆశ పడ్డ ఓ మహిళ డ్రగ్ మాఫియాలో చిక్కుకుని.. ఆఖరికి మత్తుపదార్ధాల స్మగ్లర్ గా మారిపోయింది. చివరికి విదేశాల నుంచి భారత్‌ కు డ్రగ్స్ తరలిస్తూ బెంగళూరు పోలీసులకు చిక్కింది. దీంతో నైజీరియన్‌ డ్రగ్‌ మాఫియా (Nigerian Drug Mafia) మాదకద్రవ్యాల సరఫరాకు వాళ్లు ఎంచుకుంటున్న మార్గాలు చూస్తే పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి. యువతులు, మహిళలే టార్గెట్ గా వ్యాపారంలో పెట్టుబడులు, ఇన్వెస్ట్ మెంట్ లో పార్టనర్ షిప్ అంటూ చాకచక్యంగా బుట్టలో వేసుకొని డ్రగ్ సరఫరా ఏజెంట్లుగా మార్చేస్తున్నారు. హైదరాబాద్‌ మహిళ డ్రగ్ మాఫియా చేతిలో కీలుబొమ్మగా మారిన విషయం ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చింది.

ఇక్కడ డ్రగ్ మాఫియా చేతిలో చిక్కుకున్న మహిళ వయసు సుమారు 30 ఏళ్లు. ఇంజినీరింగ్‌ చదివింది. అంతకు ముందు చిన్న ఉద్యోగం చేసేది. ఈ క్రమంలో గత సంవత్సరం సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ వచ్చింది. తమ కంపెనీలో చిన్న మొత్తం పెట్టుబడి పెడితే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయనేది ఆ మెస్సేజ్ సారాంశం. తనకు చాలీచాలని జీతం వస్తోందని, ఎక్కువ డబ్బు వస్తే ఇంటి అవసరాలు తీరతాయనే ఉద్దేశంతో ఒకసారి ట్రై చేద్దామని భావించింది మహిళ. వాళ్లు పంపించిన లింక్ ను క్లిక్‌ చేసి ముందు 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఆ తరువాత రోజు 5 వేల రూపాయలు లాభం వచ్చినట్లు మెస్సేజ్ వచ్చింది. అలా దశలవారిగా లక్షల పెట్టుబడితో, చివరికి 10 కోట్ల లాభాలు వచ్చినట్టు చూపిస్తూ వచ్చింది మాఫియా.

ఇంత పెద్ద మొత్తంలో నగదును బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయటం, చేతికి ఇవ్వడం సులువు కాదని ఆమెను ఉచ్చులోకి దించడం ప్రారంభించారు. భారీ లాభాలతో తమ కంపెనీలో భాగస్వామిగా మారినట్టు మెయిల్‌ కు మెస్సేజ్ పంపించారు. తమ కంపెనీని స్వయంగా చూడటంతో పాటు ఆమెకు వచ్చిన లాభాలకు సంబంగించిన డబ్బులు తీసుకెళ్లేందుకు రమ్మంటూ నైజీరియా ఆహ్వానించింది మాఫియా. అక్కడికి వెళ్లేందుకు వీసా, ప్రయాణ ఖర్చులు వారే భరించారు. అక్కడికి వెళ్లాక ఖరీదైన హోటల్‌ లో బస ఏర్పాటు చేసి సకల మర్యాదలు చేశారు. వారం రోజుల తరువాత  ఆమె చేతికి ఒక సూట్‌ కేస్‌ ఇచ్చి బెంగళూరులో తమ ప్రతినిధులకు ఇవ్వాలని చెప్పారు. ఇదంతా వ్యాపార కార్యకలాపాల్లో భాగమని భావించిన ఆ మహిళ దాన్ని వాళ్లు చెప్పిన ప్రాంతంలో అప్పగిస్తూ వస్తోంది. ఇలా చేసిన ప్రతి సారి లక్ష రూపాయల డబ్బుతో పాటు ఫ్లైట్ టిక్కెట్లు ఇచ్చేది డ్రగ్ మాఫియా.

సంవత్సర కాలంలో మొత్తం 8 సార్లు నైజీరియా వెళ్లి, వచ్చేటపుడు సూట్‌ కేసులు తీసుకొచ్చింది సదరు మహిళ. ఈ క్రమంలో తాజాగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ (Bangalore Airport) తనిఖీల్లో సూట్‌ కేస్‌లో కొకైన్‌ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇంకేముంది వెంటనే ఆ మహిళను అరెస్ట్‌ చేశారు. తాను డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న విషయం ఆమెకు తెలియకుండా నైజీరియన్లు చాకచక్యంగా వ్యవహరించారు. సూట్‌ కేసు చుట్టూ ఎవరూ గుర్తించలేని విధంగా కొకైన్‌ను చిన్న పొట్లాలుగా తయారు చేసి అమర్చేవారు. సూట్‌కేస్‌ లోపల రోజువారీ ఉపయోగించుకునే వస్తువులు ఉంచేవారు. తరచూ ఆ మహిళ నైజీరియా వెళ్తుండటంతో నిఘా ఉంచిన అధికారులు చివరకు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నట్టు గుర్తించారు. అధిక ఆదాయం ఆశతో ఆ మహిళ ప్రస్తుతం జైల్లో ఉచలు లెక్కపెడుతోంది. అందుకే ఇలాంటి ముఠాల ట్రాప్ లో చిక్కుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Comment As:

Comment (0)