Nirmala-Sitharaman-son-in-law-Pratik-Doshi

సింపుల్ గా నిర్మలా సీతారామన్‌ కూతురు పెళ్లి – పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?

న్యూ ఢిల్లీ- సాధారణంగా రాజకీయ ప్రముఖులు, సినిమా వాళ్లు, సెలబ్రిటీల ఇళ్లలో పెళ్లంటే ఎలా ఉంటుంది. ఎంత హంగామా.. మామూలుగా ఉండదు కదా. భారీ మంటపాలు, పెద్ద పెద్ద సెట్టింగులు, కళ్లు మిరుమిట్లుగొలిపే  వెలుగులు, అనేక రకాల వంటకాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, రాకతో అంతటా సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారుడు పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి పెళ్లి అతి సాధారణంగా జరిగింది. సమీప బంధువులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహ తంతును జరిపించారు. 

 

పరకాల వాజ్ఞ్మయి పెళ్లి ప్రతీక్‌ తో గురువారం ఏ ఆడంబరం లేకుండా మామూలుగా జరిగింది. కొంత మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ వేడుక జరిపించారు. నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రముఖులెవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం గమనార్హం. ఉడిపిలోని అదమరు మఠ్‌ కు చెందిన పురోహితులు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వాజ్ఞ్మయి, ప్రతీక్ ల వివాహ క్రతువు నిర్వహించారు. ఇక కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అల్లుడు ప్రతీక్‌ ఎవరు, ఏంచేస్తారన్నది అందరిలో ఆసక్తిరేకెత్తిస్తోంది. ప్రతీక్ ఎవరనేదానిపై నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ప్రతీక్‌ దోషీ గుజరాత్‌ కు చెందిన వ్యక్తి.

 

ప్రధాని నరేంద్ర మోదీ టీంలో పనిచేస్తున్న ముఖ్యమైనవాళ్లలో ప్రతీక్ (Pratik Doshi) ఒకరు. మోదీ 2014లో ప్రధాని అయినప్పటి నుంచి పీఎంవోతో ఆయనకు అనుబంధం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక వ్యక్తిగా పనిచేస్తున్నారు. 2019 జూన్‌లో ఆయన పీఎంవోలో జాయింట్‌ సెక్రటరీ ర్యాంకులో గా నియమితులయ్యారు. సింగపూర్‌ మేనేజ్‌ మెంట్‌ స్కూల్‌ లో ఎంబీఏ చేసిన ప్రతీక్‌, అంతకు ముందు నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఇక నిర్మలా సీతారామన్‌ (Niramala Sitharaman) కుమార్తె పరకాల వాజ్ఞ్మయి (Vangmayi) కాలమిస్ట్‌ గా పనిచేస్తున్నారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌ లిటరేచర్‌ లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన ఆమె, అమెరికాలోని మాసాచూసాట్స్‌ లోని బోస్టన్‌లో నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీలోని మిడిల్‌ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం నుంచి పట్టా పొందారు.


Comment As:

Comment (0)