Maya Lady

 ఏకంగా 1.14 కోట్ల రూపాయల టోకరా

పెళ్లిచేసుకుంటానని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కి చుక్కలు చూపించింది..

కర్ణాటక రిపోర్ట్- బెంగళూరులో (Bengalore) ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఇంజినీరును (Software Engineer) మోసం చేసిన తీరు ఔరా అనిపిస్తోంది. మ్యాట్రిమోనీ (Matrimony) ద్వారా పరిచయమైన ఓ మహిళ తెలివిగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును నిలువునా ముంచేసింది. సదరు వ్యక్తిని బెదిరించి ఏకంగా 1.14 కోట్ల రూపాయలను తన బ్యాంకు ఖాతాకు మార్పించుకున్న ఘటన బెంగళూరులో సంచలనం రేపుతోంది. కిలాడీ మహిళ వేధింపులు భరించలేక బాధిత సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్థానిక వైట్‌ ఫీల్డ్‌ పోలీస్ స్టేషల్ మహిళపై ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళ బ్యాంకు అకౌంట్ లో ఉన్న 80 లక్షల రూపాయలు విత్ డ్రా చేసుకోకుండా నిలువరించగలిగారు.

లండన్‌ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి ట్రైనింగ్ లో భాగంగా బెంగళూరు వచ్చాడు. ఈ క్రమంలో ఇక్కడే పెళ్లిచేసుకోవాలనే ఆలోచనతో ఓ ప్రైవేట్‌ వివాహ వేదికలో తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. దీంతో సాన్వి అరోరా (Sanvi Arora) అనే మహిళ ఆయనకు పరిచయమైంది. గత నెల 7న ఆమె ఆయనకు వీడియో కాల్‌ చేసింది. ఆ సమయంలో కొన్ని చూడరాని అసభ్యకరమైన దృష్యాలను ఆమె తన ఫోన్ లో రికార్డ్ చేసింది. ఇంకేముంది మరుసటి రోజు నుంచి ఆ కిలాడీ లేడీ వాలకం మారిపోయింది. ముందు రోజు  ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియోను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు వాట్సప్‌ లో పంపించింది.

అంతే ఆ వీడియోను చూసి అవాక్కవ్వడం అతడివంతైంది. కొన్ని డబ్బులు ఇస్తే ఈ వీడియోలను ఎవరికీ చూపించనని బేరాలు మొదలుపెట్టింది. అలా మొదలైన బేరాలు బెదిరింపులవరకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నుంచి ఏకంగా 1.14 కోట్లు గుంజేసింది కిలాడీ లేడీ. అక్కడితో ఆగకుండా ఇంకా డబ్బులు కావాలంటూ ఆమె డిమాండు చేయడంతో విసిగిపోయి గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు సకాలంలో స్పందించిన ఆ మహిళ బ్యాంకు అకౌంట్ లో ఉన్న 80 లక్షల రూపాయలు విత్ డ్రా చేసుకోకుండా ఆపారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.


Comment As:

Comment (0)