Jagan Sharmila

చిన్నాన్న వివేకా చివరి కోరిక నెరవేరుస్తా

నా నిర్ణయం వల్ల కుటుంబం చీలిపోతుందని తెలుసు- షర్మిల

ఇడుపులపాయ రిపోర్ట్- ఏపీ సీఎం వైఎస్ జగన్ మమోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్‌ కడప ఎంపీ టికెట్‌ ఇచ్చారని ఆమె మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను ఇడుపులపాయలో ప్రకటించారు షర్మిల.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు షర్మిల నా చెల్లెలు కాదు, నా బిడ్డ అని జగన్‌ అన్న మాటను గుర్తు చేశారు షర్మిల. ఐతే అధికారంలోకి వచ్చిన తరువాత తనను పూర్తిగా విస్మరించారని ఆవేధన వ్యక్తం చేశారు. నా అనుకున్న వాళ్లను జగన్‌ నాశనం చేశారని ఆరోపించిన షర్మిల.. హత్యా రాజకీయాలను జగన్ ప్రోత్సహించారని అన్నారు. తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్లను, చేయించిన వాళ్లను జగన్‌ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. వివేకాను హత్య చేసిన హంతకులు తప్పించుకొని తిరుగుతున్నా వారికి శిక్ష పడకుండా జగన్ కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు.

చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేయించిన ఎంపీ అవినాష్‌ రెడ్డికి జగన్‌ వైసీపీ టికెట్‌ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయానని షర్మిల అన్నారు. గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయ కోసం వాడుకుందని ఆమె ఆరోపించారు. వివేకా చివరి కోరిక తాను కడప ఎంపీగా పోటీ చేయాలని అని చెప్పిన షర్మిల.. ఆయన కోరిక నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నానని చెప్పారు. తన సోదరి వైఎస్ సునీత కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతోందని చెప్పుకొచ్చారు. హంతకుడైన అవినాష్‌ రెడ్డిని చట్ట సభలో అడుగుపెట్టకుండా చేయడమే తన లక్ష్యమని అన్నారు.

కడపలో అవినాష్ రెడ్డి గెలవకూడదు అంటే తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని షర్మిల చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయం అంత సులువైంది కాదని తెలుసన్న ఈమె.. తమ కుటుంబం నిట్ట నిలువునా చీలిపోతుందని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు షర్మిల రాజకీయ ప్రవేశ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఆమె తల్లి విజయమ్మ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కన్నీటితో ప్రార్థన చేశారు. తమ కుటుంబానికి వచ్చిన పరీక్షలో నెగ్గేలా చేయమని ప్రార్థించారామె.


Comment As:

Comment (0)