Uttam Kumar Reddy

కేవలం కేసీఆర్‌ వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు నాశనమైంది - ఉత్తమ్

హైదరాబాద్ రిపోర్ట్- బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. కేవలం కేసీఆర్‌ (KCR) వల్లనే మేడిగడ్డ (Medigadda) నాశనమైందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను కాపాడలేని అసమర్థుడు కేసీఆర్‌ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ సాగునీటి రంగం, ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ లో ఉత్తమ్ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. కేసీఆర్‌ సీఎంగా, నీటిపారుదల శాఖ మంత్రిగా కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు ఆయన హయాంలోనే కూలిపోయిందని ఈ సందర్బంగా ఉత్తమ్ చెప్పుకొచ్చారు.

మేడిగడ్డ బ్యారేజ్ ను ఇప్పుడు కేసీఆరే రిపేర్‌ చేస్తానని చెప్పడం జోక్‌లా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పూర్తికావాలంటే ఒక లక్షా 50 వేల కోట్లు అవసరం అవుతుందని చెప్పారాయన. 30 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీరిచ్చామని కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు చెపుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ ద్వార కేవలం లక్షా 30 వేల ఎకరాలకు మాత్రమే నీరిచ్చారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతి సంవత్సరం 10 వేల కోట్ల కరెంటు బిల్లు వస్తుందని వివరించారు.

కేసీఆర్ కనీస జ్ఞానం లేకుండా ఎంత ఖర్చయినా నీరు తెస్తున్నామని అంటున్నారన్న ఉత్తమ్.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ప్రాణహిత-చేవెళ్ల నీటి నిల్వ సామర్థ్యం 14 టీఎంసీలే అని అబద్ధాలు చెపుతున్నారని మండిపడ్డారు. కేవలం కమీషన్ల కక్కుర్తి వల్లనే ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి కాళేశ్వరం కట్టారని ఆరోపించారు ఉత్తమ్. రీడిజైన్‌తో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు సాగించిన దోపిడీ వల్ల రుణభారం తెలంగాణ ప్రజలపై పడబోతోందని చెప్పుకొచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం హైదరాబాద్ సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


Comment As:

Comment (0)