Libya Floods

23 అడుగుల ఒక రాకాసి అల ఆ ఊరిపై విరుచుకుపడింది

క్షణాల్లో విధ్వంసం - ఊరిపై విరుచుకుపడ్డ రాకాసి అల

ఇంటర్నేషనల్ రిపోర్ట్- లిబియా (Libya) ను జల ప్రళయం తీవ్ర విషాదంలో ముంచేసింది. డేర్నా(Derna) లో కేవలం ఒక్కే ఒక్క రాకాసి అల సుమారు 20 వేల మంది ప్రాణాలను తీసింది. భారీ అల ప్రతాపానికి 20వేల మంది చనిపోయి ఉంటారని అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీ (ఐసీఆర్‌సీ) నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రాకాసి అల ఎత్తు సుమారు 7 మీటర్లు ఉందని వారు చెప్పారు. ఇంకా కొన్ని పల్లపు ప్రాంతాల్లో ఈ అల ఎత్తు దాదాపు ఆరు అంతస్తుల భవనం అంతకు చేరుకొందని ప్రత్యక్ష్య సాక్షులు చెబుతున్నారు. అలతో పాటు అత్యంత వేగంతో దూసుకొచ్చిన బురద నీరు భారీ భవనాలను సైతం కుప్పకూల్చి ప్రజలను ఈడ్చుకొని సముద్రంలోకి తీసుకెళ్లిపోయింది. ఈ విషాదకర ఘటన జరిగి రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ అక్కడి సముద్ర తీరంలో మృతదేహాలు తేలియాడుతూ కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతోంది. 

లిబియా (Libya) లోని డేర్నా(Derna) లో ఈ జల ప్రళయం సెప్టెంబరు 10న తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఆ టైంలో ప్రజలు గాఢనిద్రలో ఉండటంతో తప్పించుకొనే అవకాశం దాదాపు లేకుండా పోయింది. సమీపంలోని డ్యామ్‌ బద్దలైన వెంటనే ఓ రాకాసి అల పర్వత కనుమలను దాటుకొని వచ్చి ఊరిపై విరుచుకుపడింది. ఈ ఊరిలో సుమారు లక్ష మందికి పైగా జనం ఉంటున్నారు. ఇక ఈ విషాదకర ఘటనలో ఇప్పటివరకు 11 వేల మృతదేహాలను గుర్తించారు. మరికొన్ని వేల మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెప్పారు. సుమారు 30 వేల మంది ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. డేర్నాలో ఎటు చూసినా విషాద ఛాయలే కన్పిస్తున్నాయి.


Comment As:

Comment (0)