Revanth vs Uttam

గాంధీభవన్‌లో జరిగిన పీఈసీ సమావేశంలో వాగ్వాదం

ఉత్తమ్‌ వర్సెస్ రేవంత్‌ రెడ్డి - రెండు టిక్కెట్స్ విషయంలో వాగ్వాదం

పొలిటికల్ రిపోర్ట్- తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వాక్ స్వాతంత్ర్యం చాలా స్పష్టంగా కనిపించింది. గాంధీభవన్‌ (gandhibhavan) లో జరిగిన పీఈసీ సమావేశంలో టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy), మాజీ పీసిసి చీఫ్-ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీలో ఒకే కుటుంబానికి రెండు టికెట్ల విషయంలో ఇద్దరి మధ్య వివాదం చలరేగినట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే ఆశావహుల నుంచి  ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించగా.. ఆశావహుల జాబితాను వడపోసే ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ  మంగళవారం గాంధీభవన్‌ లో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. సుమారు మూడున్నర గంటల పాటు ఈ కమిటీ అభ్యర్ధుల ఎంపికపై చర్చించింది.

ఈ సందర్బంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల అభ్యర్ధులకు సంబంధించిన స్థానాలతో పాటు, ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపై రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగిట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఒకే ఫ్యామిలీలో ఇద్దరు అభ్యర్థుల అంశంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధిష్టానం దగ్గర ప్రతిపాదన చేయాలని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఐతే ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపై ఢిల్లీ పెద్దలే నిర్ణయం తీసుకుంటారని, తాను ప్రత్యేకంగా ఎలాంటి ప్రతిపాదన చేయనని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి.  పీసీసీ అధ్యక్షుడిగా ఈ అంశంపై  నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఉత్తమ్‌ పట్టుపట్టగా, తనను డిక్టేట్‌ చేయవద్దంటూ ఉత్తమ్ పై రేవంత్‌ రెడ్డి కొంత సీరియస్ అయినట్లు సమాచారం.

దీంతో ఆగ్రహించిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 2వ తేదీన మరోసారి సమావేశం కావాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ (Huzurnagar) నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ (Kodada) నుంచి ఆయన సతీమణి పద్మావతి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
 


Comment As:

Comment (0)