Teegala Krishna Reddy

బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌.. కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎమ్మెల్యే తీగల

తెలంగాణ పొలిటికల్ రిపోర్ట్- తెలంగాణ (Telangana) లో శాశనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ రాజకీయ పరిణామాల్లో మార్పు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలను రచించేపనిలో పడ్డాయి. ఒకరిపై ఒఖరు పోటాపోటీగా విమర్శలు, ప్రతి విమర్శలతో దాడికి దిగుతున్నాయి. ఇదే సమయంలో రాజకీయ పార్టీల్లోని అసంతృప్తితో ఉన్న నేతలు మెల్లగా జారుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కదని నిర్ధారణకు వచ్చిన నేతలు ఇప్పటి నుంచే వేరే పార్టీల్లో జాయిన్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే అధికార బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో రగులుతున్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) పార్టీ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ అనితా రెడ్డి (Anitha Reddy) తో కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ ఇంచార్జ్‌ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లతో తీగల కృష్ణారెడ్డి, అనితా రెడ్డిలు రహస్యంగా సమావేశమైనట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కోడలు అనితా రెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ హయాంలో హైదరాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొంది, టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఐతే సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్‌ లో చేరి మంత్రి అయ్యారు.

ఈ క్రమంలో సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) , తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచే ఉండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొంతకాలంగా తీగల కృష్ణారెడ్డి అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూవస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం టికెట్ ఇవ్వకుంటే కారు దిగడం ఖాయమని ఎప్పుడో హెచ్చరించినా బీఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి హామీ దక్కకపోవడంతో ఇక లాభం లేదని కాంగ్రెస్ పార్టీలో చేరాలని తీగల కృష్ణారెడ్డి డిసైడ్ అయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.


Comment As:

Comment (0)