Jamili

ఒకే దేశం-ఒకే ఎన్నికల పై పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం.

ఒకే దేశం-ఒకే ఎన్నికలు.. ఏమిటీ జమిలీ ఎన్నికలు

స్పెషల్ రిపోర్ట్- భారత్ లో మరోసారి జమిలీ (Jamili) ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. మోదీ సర్కార్ చాలా కాలంగా ఒకే దేశం- ఒకే ఎన్నికలు (One Nation, One Election) పై కసరత్తు ఆలోచన చేస్తూవస్తోంది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో జమిలీ ఎన్నికలపై కసరత్తు ప్రారభించింది కేంద్ర ప్రభుత్వం. ఒకే దేశం-ఒకే ఎన్నికల  సాధ్యాసాధ్యాల పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  (Ram Nath Kovind) నేతృత్వంలో ప్రత్యేకందా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అంతే కాదు మరో పదిహేను రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి జమిలీ ఎన్నికలకు సంబందించిన రాజ్యాగ సవరణ చేసేందుకు మోదీ సర్కార్ చక చకా ఏర్పాట్లు చేస్తోంది

ఇదిగో ఇటువంటి సమయంలో జమిలీ ఎన్నికలు అంటే ఏమిటీ ? ఒకే దేశం- ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజం ఏంటీ? ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియకు, జమిలీ ఎన్నికల ప్రక్రియకు తేడా ఏంటీ? వంటి ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి చాలా మందిలో. దేశంలో ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నది జమిలీ విధానం. అంటే లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓటింగ్‌ ఒకేసారి నిర్వహించడం. ప్రస్తుతం అసెంబ్లీలకు, పార్లమెంట్‌ కు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో 1967 వరకు ఈ విధంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. కానీ, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దుకావడం, 1970లో ఏడాది ముందే లోక్‌సభ రద్దు కావడం వంటి పరిణామాలతో ఈ విధానం కొనసాగించడం సాధ్యం కాలేదు.

ఆ తరువాత 1983లో ఎన్నికల కమిషన్‌ మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చినా.. అప్పట్లో ప్రభుత్వం ఆసక్తి కనబరచలేదు. 2016 లో ప్రధాని మోదీ (PM Modi) జమిలీ ఎన్నికలపై ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. 2019లో ఒకే దేశం ఒకే ఎన్నికలుపై ప్రధాని వివిధ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా, కాంగ్రెస్‌ సహా చాలా పక్షాలు దీనికి దూరంగా ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు మళ్లీ జమిలీ ఎన్నికలపై మోదీ సర్కార్ సీరియస్ గా దృష్టి సారించింది. అందుకే  సెప్టెంబర్‌ 18 నుంచి 22 మధ్య జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం ఒకే ఎన్నికలు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐతే పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్‌ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది.

ఈ సవరణలకు లోక్‌ సభలోని 543 స్థానాల్లో కనీసం 67శాతం అనుకూలంగా ఓటువేయాలి. అటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం ఓటింగ్ అవసలం. అంతే కాదు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించి పంపాల్సి ఉంటుంది. బీజేపీ ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా, జమిలీ బిల్లుకు మరో ఆరు రాష్ట్రాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్టీఏ కు లోక్‌భలో దాదాపు 333 ఓట్ల బలం ఉండగా, ఇది 61శాతానికి సమానం. మరో 5 శాతం మద్దతును కూడగట్టడం కొంత కష్టమేనని చెప్పాలి. అటు రాజ్యసభలో కేవలం 38 శాతం మాత్రమే జమిలీకి అనుకూలంగా ఓట్లు పడనున్నాయి.

ఒకే దేశం- ఒకే ఎన్నికల (One Nation, One Election) వల్ల ఎలక్షన్ నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుందని చెబుతున్నారు. 2019లో పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సుమారు 10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కో రాష్ట్ర ఎలక్షన్ కు 250 కోట్ల నుంచి 500 కోట్లు ఖర్చవుతోంది. ఇక రాజకీయ పార్టీల ఓట్ల కోసం చేసే ఖర్చుకు అంతే లేదని చెప్పాలి. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ఆయా రాజకీయ పార్టీల ఖర్చు 60 వేల కోట్ల వరకు ఉందని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అనే సంస్థ పేర్కొంది. ఒకే దేశం ఒకే ఎన్నిక ఐతే ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తగ్గిపోవడంతో పాటు రాజకీయ పార్టీల ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. (One Nation, One Election)


Comment As:

Comment (0)