Chandra Babu

పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోందన్న బాబు

సైకిల్ కు ఎదురొస్తే తొక్కుకుంటూ పోతాం - చంద్రబాబు

స్పెషల్ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu) నాయుడు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో గండికోట రిజర్వాయర్ (Gandikota Reservoir) ను పరిశీలించారు చంద్రబాబు. ఆ తరువాత పులివెందులలో (Pulivendula) చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. పులివెందుల ప్రజల్లో ఇప్పుడు తిరుగుబాటు కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) సొంత నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు రోడ్ షోకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో పులివెందుల జనసంద్రంగా మారింది. 

సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా బుధవారం గండికోట రిజర్వాయర్‌ ను పరిశీలించిన తరువాత పులివెందుల పూల అంగళ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఈ సందర్బంగా ప్రకటించారు. రాయలసీమ ఆశాజ్యోతి ఎన్టీఆర్‌.. రాయలసీమకు నీళ్లు ఇచ్చాకే చెన్నైకు వెళ్లాలని ఎన్టీఆర్‌ చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎస్‌ఆర్‌బీసీ ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్‌దేనని.. తాను వచ్చాక ముచ్చుమర్రిలో లిఫ్ట్‌లు పూర్తి చేశామని చెప్పారు. పులివెందులకు నీళ్లు తెచ్చిన ఘనత మాదేనని చెప్పిన చంద్రబాబు.. గండికోట, పైడిపాలెం, చిత్రావతికి నీళ్లొచ్చాయంటే అది తమ ఘనతేనని అన్నారు.

టీడీపీ నాయకుడు బీటెక్‌ రవిని గెలిపిస్తే పులివెందులను గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పారు. పులివెందులకు పరిశ్రమలు తీసుకొస్తామని, వచ్చే ఎన్నికల్లో మీ శక్తి ఏమిటో పులివెందుల ప్రజలు చూపించాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ మాట వివేకా ఎప్పుడూ వినేవారని అందరూ అనేవారని గుర్తు చేసిన చంద్రబాబు, బాబాయిపై గొడ్డలి వేటు వేసింది ఎవరు అని ప్రశ్నించారు. తండ్రి హత్య కేసుపై వైఎస్ సునీత పోరాటం చేస్తోందన్న చంద్రబాబు.. ఇక్కడి ఎంపీ ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. వివేకాను ఎవరు చంపారో మీ ఎంపీకి తెలియదా అని ప్రశ్నించారు. పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు అన్యాయం జరిగిందని, కోడికత్తి డ్రామా ఆడే వ్యక్తి మనకు కావాలా అని పులివెందుల ప్రజలను అడిగారు చంద్రబాబు. సైకిల్‌ కు ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని హెచ్చరించిన చంద్రబాబు.. పులివెందుల ప్రజలు తమను వదిలిపెట్టరని అన్నారు.


Comment As:

Comment (0)