Chandrayaan3 and Luna25

చంద్రయాన్‌-3 నుంచి విడిపోయిన విక్రమ్‌.. కీలక ఘట్టం పూర్తి

చందమామపైన ముందుగా దిగేదెవరు- చంద్రయాన్‌-3 Vs లూనా-25

స్పెషల్ డెస్క్- చందమామపై (Moon Mission) లోతైన పరిశోధనలు చేసేందుకు  ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) మరో కీలక దశకు చేరుకుంది. ఈ ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి సక్సెస్ ఫుల్ గా విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌ (Vikram, Pragyan) చంద్రుడి దక్షిణ ధృవంలోని ఉపరితలంపై ల్యాండ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఐతే ఇదే సమయంలో రష్యా (Russia) ప్రయోగించిన లూనా-25 (Luna-25) సైతం చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే దిగనుంది. ఇలా ఒకేసారి రష్యా, భారత్ లు ప్రయోగించిన ల్యాండర్లలో ఏముందుగా ఏది చందమామపై దిగనుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత్, రష్యా ల్యాండర్లు కొంత సమయం తేడాతోనే చంద్రుడిపై దిగే అవకాశాలున్నాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

భారత్ జులై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 చందమామకు దగ్గరకు వెళ్లేందుకు మొత్తం 40 రోజులకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. ఇదే సమయంలో సుమారు 50 ఏళ్ల విరామం తర్వాత చంద్రుడిపై పరిశోధనల కోసం ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన లూనా-25, కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిని చేరుకోబోతోంది. లూనా-25కి ఇంధన నిల్వ సామర్థ్యం భారీగా ఉండటంతో చంద్రుడిపైకి నేరుగా మరియు త్వరగా వెళ్లేందుకు వీలవుతుందని, చంద్రయాన్‌-3లో ఇంధన సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసార్లు కక్ష్యలో తిరుగుతూ వెళ్లాల్సి వచ్చిందని ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌ తెలిపారు. అందుకే చంద్రయాన్-3ని ప్రయోగించిన 22 రోజుల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిందని ఆయన చెప్పారు.

చంద్రయాన్‌-3 ను చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఆగస్టు 23న సురక్షితంగా దించేందుకు ఇస్రో తలమునకలవ్వగా, రష్యా ప్రయోగించిన లూనా-25 ఆగస్టు 21 నుంచి 23వ తేదీల మధ్య చంద్రుడిపై దిగనున్నట్లు తెలుస్తోంది. చంద్రయాన్-3 ల్యాండింగ్ పై ఇస్రో ఇప్పటికే స్పష్టతనిచ్చినప్పటికీ, రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌ కాస్మోస్‌ (Roscosmos) మాత్రం ఖచ్చితంగా ఏ టైంలో లూనా-25 దిగుతుందనే విషయాన్ని ప్రకటించలేదు. భారత్, రష్యా ప్రయోగించిన మిషన్‌ లు సక్సెస్ ఫుల్ గా చంద్రుడిపై దిగితే, ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 మొత్తం 14 రోజుల పాటు పనిచేయనుండగా, లూనా-25 మాత్రం ఏకంగా సంవత్సర కాలం పాటు పరిశోధనలు చేయనుంది.

భారత్, రష్యాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ఈ మిషన్‌ లు చందమామపై దిగే సమయాన్ని సూర్యకాంతి ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చంద్రుడి ల్యాండర్లు దక్షిణ ధ్రువంపై దిగే టైంలో అక్కడ వెలుగు ఉండాలని తెలిపారు. సాధారనంగా చంద్రుడిపై ఆగస్టు 23 నుంచి పగలు మొదలవుతుంది. ఇలా కొద్ది సమయం తేడాతో భారత్‌, రష్యాలు ప్రయోగించిన వ్యోమనౌకలు చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మొత్తం ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 
 


Comment As:

Comment (0)