Train

ట్విట్టర్ ద్వార తెలిపిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

ఉత్తరాంధ్ర వాసులకు తీపికబురు - విశాఖ నుంచి నేరుగా వారణాసికి ట్రైన్

స్పెషల్ రిపోర్ట్- భారత రైల్వే శాఖ (Indian Railways) ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త చెప్పింది. విశాఖపట్నం (Vishakhapatnam) నుంచి కాశీ వెళ్లేందుకు రైలును అందుబాటులోకి తెచ్చింది ఇండియన్ రైల్వేస్. వారణాసికి (Varanasi) వెళ్లేందుకు వీలుగా సంబల్‌ పూర్‌ నుంచి బనారస్‌ మధ్య నడిచే (18311) ఎక్స్‌ప్రెస్‌ రైలును విశాఖపట్నం వరకు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు (Ram Mohan Naidu) ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేర్చినందుకు రైల్వే శాఖకు ధన్యవాదాలు తెలిపారు రామ్మోహన్‌ నాయుడు. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర వాసులు కాశీవిశ్వనాధుడిని దర్శించుకునేందుకు వెళ్లాలంటే విజయవాడ లేదా భువనేశ్వర్‌ వెళ్లి రైలు ఎక్కాలి. వారణాసి లో కర్మకాండలకు సంబంధించిన కార్యక్రమాలకు వెళ్లాల్సివస్తే చాలా కష్టపడాల్సి వచ్చేది.

చాలా సంవత్సరాల నుంచి వారణాసికి నేరుగా రైలు నడపాలని ఉత్తరాంధ్ర వాసులు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. తాను శ్రీకాకుళం ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఇదే విషయాన్ని చాలా సార్లు లోక్ సభలో లేవనెత్తడంతో పాటు రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లానని రామ్మోహన్‌ నాయుడు చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రైల్వే శాఖ రైలు పొడిగింపునకు నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఇకపై వారానికి రెండు రోజుల పాటు  అంటే బుధవారం, శనివారం ఒడిశాలోని సంబల్‌ పూర్‌ నుంచి మొదలయ్యే ఈ రైలు, విశాఖపట్నం నుంచి త్వరలో అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, సంబల్‌ పూర్‌ స్టేషన్ల మీదుగా వారణాసికి వెళ్తుందీ రైలు.
 


Comment As:

Comment (0)