etala

నడ్డాకు ముక్కుసూటిగా అన్నీ చెప్పాం

నడ్డాకు ముక్కుసూటిగా అన్నీ చెప్పాం- ఈటల, కోమటిరెడ్డి 

పొలిటికల్ డెస్క్- తెలంగాణ బీజేపీ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు ఈటల రాజేందర్‌ (Etala Rajender), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (rajagopal reddy) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)తో  ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సుమారు మూడున్నర గంటల పాటు జరగిన ఈ సమావేశంలో తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. నడ్డాతో భేటీ ముగిసిన తరువాత ఈటల రాజేందర్‌ తో కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నడ్డాతో సుదీర్గంగా చర్చించామని ఈటల చెప్పారు. పార్టీలో ప్రస్తుతం పరిస్థితులను నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా వివరించామని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే కేసీఆర్‌ దోపిడీ పాలనకు అడ్డుకట్ట పడుతుందని తెలంగాణ ప్రజలు నమ్మిన విషయాన్ని నడ్డా దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆ విషయంలో ఎలా ముందుకెళ్తే బాగుంటుందో వివరించామని తెలిపారు. నడ్డాకు తెలంగాణలో జరుగుతున్న అన్ని విషయాలు తెలుసని, ఐనప్పటికీ మా బాధ్యతగా అన్ని అంశాలను వివరించామని ఈటల రాజేందర్ చెప్పారు. 

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన ఆలస్యం కారణంగానే వేరే విధంగా ఆలోచించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లాలని నడ్డాను కోరినట్లు చెప్పారు. తప్పకుండా తెలంగాణ ప్రజలు బీజేపీని విశ్వసిస్తారని, అవినీతి బీఆరెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే ఆస్కారముందని అన్నారు. అందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పామని, అన్ని అంశాలపై  నడ్డా సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి చెప్పారు. కర్ణాటక ఫలితాల తర్వాత అక్కడక్కడ ఏదో మాట్లాడుతున్నారని, ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. 


Comment As:

Comment (0)