Heavy Rains

మంగళవారం తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ(Telangana)  లో మళ్లీ భారీ వర్షాలు (Heavy Rains) కురవనున్నాయి.  సమారు పది జిల్లాల్లో మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీగా వానలు పడే సూచనలున్నాయని ఐఎండి పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. మరోవైపు సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆదివారం సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీమీటర్లు, మేడ్చల్‌ లో 37.5, మెదక్‌ జిల్లా కాగజ్‌ మద్దూర్‌ లో 35, యాదాద్రి జిల్లా బీబీనగర్‌ లో 27.5, నిర్మల్‌ జిల్లా విశ్వనాథ్‌పూర్‌ లో 27, సంగారెడ్డి జిల్లా లక్ష్మిసాగర్‌ లో 26.8, మేడ్చల్‌ జిల్లా కేశవరం లో 26, ఆలియాబాద్‌ లో 25, బండ మాదారంలో 24.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. మంచిర్యాల, ఆదిలాబాద్‌, జగిత్యాల, నిజామాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, జనగామ, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి,  జిల్లాలతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని  సికింద్రాబాద్‌, నేరెడ్‌మెట్‌, కూకట్‌పల్లి, బాచుపల్లి, తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కరిసింది. మంగళవారం భారీ వర్షం కురవనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. (Weather Report)


Comment As:

Comment (0)