IRCTC tour package

హైదరాబాద్‌ నుంచి తిరుపతి విమాన ప్రయాణం.. ఈజీగా శ్రీనివాసుడి దర్శనం

స్పెషల్ రిపోర్ట్- తిరుమల (Tirumala) తిరుపతి (Tirupati) లో వెలసిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని (Lord Venkatesha) దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని భక్తులు తహతహలాడుతుంటారు. కానీ తిరుమల ప్రయాణమంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. అందులో మరీ ముఖ్యమంగా తిరుమల వెంకన్న దర్శనం అంత ఈజీ కాదు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లాలంటే పక్కా ప్రణాళికతో వెళ్లాలి.

ఇదిగో ఇలాంటి భక్తుల కోసమే కేవలం రెండు రోజుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యేలా ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి. శ్రీవారి దర్శన టికెట్ల కోసం ఏ మాత్రం కష్టపడకుండా శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవచ్చు. తిరుపతికి రానూపోనూ విమాన ప్రయాణమే కాబట్టి కేవలం రెండు రోజుల్లోనే తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేయవచ్చు.

ఇక తిరుమలతో పాటు చుట్టు పక్కల పుణ్యక్షేత్రాలు కూడా ఈ ప్యాకేజీలోనే దర్శించుకోవచ్చు. తిరుపతి బాలాజీ దర్శనం (TIRUPATI BALAJI DARSHNAM) పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని (IRCTC tour package) అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 1 నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. ఈ ప్యాకేజీతో కేవలం రెండు రోజుల్లోనే తిరుమల శ్రీనివాసుని దర్శించుకొని తిరిగి వచ్చేయవచ్చు. అంతే కాదు తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలను కూడా సందర్శించవచ్చు. ఆగస్టు నెలలో 1, 3, 8, 10, 17, 22, సెప్టెంబర్‌ నెలలో 12, 26 తేదీల్లో, అక్టోబర్‌ నెలలో 3, 5, 10, 12, 31 తేదీల్లో ఈ ప్రత్యేక యాత్ర ఉంటుంది. మీ ప్రయాణ సమయానికి అనుగుణంగా ముందుగానే టిక్కెట్లను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.


తిరుపతి బాలాజీ దర్శనం ప్యాకేజీ లో భాగంగా హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు విమానం (6E-2005) తిరుపతి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2:05 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బస్సు లో కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం తిరుపతిలో ముందుగా ఏర్పాటు చేసిన హోటల్‌ కు చేరుకు, అక్కడే రాత్రి భోజనం చేసి బస చేయాల్సి ఉంటుంది. ఇక రెండో రోజు ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత తురుమల కొండపైకి చేరుకుంటారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అక్కడే భోజనం ముగించుకొని శ్రీకాళహస్తికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆలయాన్ని దర్శించుకుని అక్కడి నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని, విమానం (6E-267) ఎక్కి హైదరాబాద్ కు వచ్చేస్తారు.

ఇక తిరుపతి బాలాజీ దర్శనం ప్యాకేజీలో సింగిల్‌ షేరింగ్ కు 16,330 చార్జీ చేస్తుండగా, డబుల్ షేరింగ్‌ 14,645 రూపాయలు, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ 14,550 రూపాయల చార్జీ ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు ఒకరికి విత్‌ బెడ్‌ అయితే 13,740.. విత్‌ అవుట్‌ బెడ్‌ అయితే 13,490 రూపాయలు చెల్లించాలి. 2 నుంచి 4 ఏళ్ల మధ్య చిన్నారులకు 13,490, రెండేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు ఎయిర్ పోర్ట్ లో 1,500 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో హైదరాబాద్‌- తిరుపతి- హైదరాబాద్‌ విమాన టికెట్లు, తిరుపతిలో ఒక రాత్రి బస కోసం ఏసీ హోటల్‌ గది, మొదటి రోజు రాత్రి భోజనంరెండో రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, ఒక చోటు నుంచి మరో చోటుకు ఏసీ బస్సులో ప్రయాణం, తిరుమల శ్రీవారి దర్శన టికెట్లతో పాటు తిరుచానూరు, శ్రీకాళహస్తి కాణిపాకం, శ్రీనివాస మంగాపురం దర్శనం ఉంటాయి. మిగతా ఖర్చులేమైనా ఉంటే ఎవరికి వారు భరించాల్సి ఉంటుంది.

 

 

 


Comment As:

Comment (0)