Pragyan Rover

విశ్రాంతి తీసుకుంటున్న విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌

ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడిపై సురక్షి ప్రాంతంలో పార్క్ చేసిన ఇస్రో

ఇంటర్నేషనల్ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో (ISRO) చంద్రుడి పైకి పంపిన చంద్రయాన్-3 (Chandrayaan-3) దిగ్విజయంగా తన పనిని పూర్తి చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువం దిగిన విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander), ప్రజ్ఞాన్‌ రోవర్‌ (Pragnan Rover) లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకొని రెస్ట్ తీసుకునేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో ముందు ప్రజ్ఞాన్ రోవర్‌ ను నిద్రాణ స్థితిలోకి పంపినట్లు ఇస్రో ప్రకటించింది. ఐతే అది తాత్కాలిక విరామమా లేక శాశ్వత నిద్రావస్థ అన్నది మరో రెండు వారాల్లో తెలుస్తుందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు.  ప్రజ్ఞాన్ రోవర్‌ తన లక్ష్యాలను పూర్తి చేసుకోవడంతో, దాన్ని ఇప్పుడు సురక్షిత ప్రదేశంలో నిలిపి ఉంచి, నిద్రాణ స్థితిలోకి పంపించేశామని ఇస్రో తెలిపింది.

అందులోని ఏపీఎక్స్‌ఎస్‌, లిబ్స్‌ పరికరాలను స్విచ్ఛాఫ్‌ చేసి.. అంతకు ముందే ఈ రెండు పరికరాల నుంచి డేటా మొత్తం విక్రమ్ ల్యాండర్‌ ద్వారా భూమికి చేరిందని ఇస్రో స్పష్టం చేసింది. చంద్రయాన్-3 ద్వార చంద్రుడిపైకి వెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ లకు సూర్య రష్మి ద్వారానే పవర్ అందుతుంది. అవి సోలార్ ప్యానెల్స్ ద్వారా సూర్యకాంతిని గ్రహించి, బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటాయి. ఐతే చంద్రుడిపై ఒక పగలు పనిచేసేలా వీటిని రూపొందించారు. అంటే భూమి మీద 14 రోజులతో సమానం. ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విక్రమ్‌ ల్యాండర్ ల్యాండ్ అయ్యేటప్పటికే అక్కడ తెల్లవారింది.

ఆ తరువాత ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్ కూడా తన బ్యాటరీలను రీఛార్జి చేసుకొని, పరిశోధనలు మొదలుపెట్టింది. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్‌ నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ ఇప్పటివరకు 100 మీటర్లకు పైగా దూరం ప్రయాణించినట్లు ఇస్రో తెలిపింది. రోవర్‌ ప్రయాణించిన మార్గానికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌ లో పోస్టు చేసింది. ప్రజ్ఞాన్‌ రోవర్‌ సెంచరీ కొట్టినట్లు పేర్కొంది ఇస్రో. ఈ వ్యోమనౌకలు దిగిన శివ్‌శక్తి పాయింట్‌ దగ్గర ఇప్పుడు సాయంకాలం ప్రారంభమైంది. క్రమంగా అక్కడ వెలుతురు తగ్గుతోంది. మెల్లగా చీకటి పడటం మొదలైంది. ఇప్పటి నుంచి అక్కడ 14 రోజుల పాటు రాత్రి సమయం ఉంటుంది.

చంద్రుడిపై రాత్రివేళ నెలకొనే ప్రతికూల పరిస్థితులను విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లు తట్టుకోలేవు. కంటిన్యూ గా 14 రోజుల పాటు సూర్యకాంతి అందుబాటులో లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. ఆ టైంలో విక్రమ్, ప్రజ్ఞాన్ బ్యాటరీల రీఛార్జి చేసుకోవడం కుదరదు. మరోవైపు చందమామ దక్షిణ ధృవంపై రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సుమారు మైనస్‌ 200 డిగ్రీలకు పడిపోతాయి. ఇంత భయంకరమైన చల్లని వాతావరణాన్ని ల్యాండర్‌, రోవర్‌ లోని సున్నితమైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు తట్టుకోలేకపోవచ్చు. దీంకో ఈ రెండు వ్యోమనౌకలను నిద్రాణ స్థితిలోకి తీసుకెళ్లి భద్రమైన ప్రదేశంలో పార్క్ చేసింది ఇస్రో. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ లు నిద్రాణ స్థితిలోకి వెళ్లడానికి ముందు వరకూ చాలా అద్భుతంగా పనిచేశాయి. అందుకే చంద్రుడిపై 14 రోజుల రాత్రి సమయం పూర్తయ్యాక, మళ్లీ సూర్యోదయమయ్యాక అవి క్రియాశీలమయ్యే అవకాశం లేకపోలేదు.

ఇది జరగాలంటే నిద్రాణ స్థితికి వెళ్లే ముందే ల్యాండర్‌, రోవర్‌ల బ్యాటరీలు ఫుల్ గా రీఛార్జి కావాలి. చంద్రుడిపై రాత్రి సమయంలో తలెత్తే చల్లని ఉష్ణోగ్రతలను అవి తట్టుకోవాలి. ప్రస్తుతం విశ్రాంతి దశలోకి వెళ్లిన రోవర్‌ లోని బ్యాటరీలు పూర్తిగా రీఛార్జి అయ్యాయని ఇస్రో పేర్కొంది. తిరిగి ఈ నెల 22న శివశక్తి పాయింట్‌ దగ్గర సూర్యోదయమవుతుందని తెలిపింది. ఆ రోజున సోలార్ పవర్ ను అందుకునేలా ప్రజ్ఞాన్ రోవర్‌ ప్యానెల్స్ దృక్కోణాన్ని మార్చినట్లు ఇస్రో పేర్కొంది. అంతే కాదు దాని రిసీవర్‌ ను ఆన్‌ చేసి పెట్టినట్లు తెలిపింది. ఈనెల 22న అక్కడ సూర్యోదయమవ్వగానే దాన్ని నిద్రాన స్థితి నుంచి మేల్కొల్పడానికి ప్రయత్నిస్తామని ఇస్రో పేర్కొంది. అది నిద్రలేచి యాక్టివ్ గా పనిచేస్తే మరో 14 రోజుల పాటు తన పరిశోదనలు కొనసాగించనుంది. లేదంటే చంద్రుడిపై భారత రాయబారిగా శాశ్వతంగా ఉండిపోతుందని ఇస్రో ప్రకటించింది.


Comment As:

Comment (0)