Team India

అనూహ్యంగా కేఎల్‌ రాహుల్‌కు చోటు

వన్డే ప్రపంచ కప్ కు ఎంపికైన భారత జట్టు

స్పోర్ట్స్ రిపోర్ట్- ప్రపంచ కప్ కు ఇండయన్ క్రికెట్ టీం (Team India) సభ్యులను ఎంపికచేసింది. అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ వన్డే ప్రపంచకప్‌కు (world cup 2023) భారత జట్టును ప్రకటించింది. ఫిట్‌నెస్‌ సమస్యలతో చర్చనీయాంశంగా మారిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ సారి జట్టులో స్థానం సంపాదించాడు. ఆసియాకప్‌ జట్టులో ఉన్న తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణలకు నిరాశే ఎదురైంది. 

భారత ప్రపంచకప్‌ జట్టు (world cup 2023 india team) - రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌, షమి, సిరాజ్‌, బుమ్రా.

నెల రోజుల్లో మొదలు కాబోయే వన్డే ప్రపంచకప్‌ కోసం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. సెలక్షన్‌ కు ముందు అత్యంత ఆసక్తి రేకెత్తించిన కేఎల్‌ రాహుల్‌ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఆసియాకప్‌ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కావడంతో రాహుల్‌ ఫిట్‌నెస్‌పై అనుమానాలు తలెత్తాయి. కాని చివరకు రాహల్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అగార్కర్‌ స్పష్టం చేశాడు. ఇక సెలక్టర్లు రెండో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ గా ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేశారు. ఇషాన్‌, రాహుల్‌ ల ఎంపికతో మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌ కు ఛాన్స్ లేకుండా పోయింది.

ఇంకా వన్డే అరంగేట్రం చేయని తిలక్‌ను కాదని, ఈ ఫార్మాట్లో ప్రదర్శన సరిగా లేని సూర్యనే సెలక్షన్‌ కమిటీ ప్రపంచకప్‌ కోసం ఎంపికచేసింది. 32 ఏళ్ల సూర్య ఇటీవలే వెస్టిండీస్‌ తో సిరీస్‌లో విఫలమైన సంగతి తెలిసిందే. బౌలింగ్‌లో ఊహించినట్లే బుమ్రా, సిరాజ్‌, షమి ముగ్గురు ప్రధాన పేసర్లుగా ఎంపికయ్యారు. ఆసియాకప్‌ జట్టులో ఉన్న మరో పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణకు అవకాశం దక్కలేదు. ఇక బ్యాటింగ్‌ కూడా చేయగల సామర్థ్యం వల్ల శార్దూల్‌ ఠాకూర్‌ కు జట్టులో స్థానం కల్పించారు. కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, జడేజా జట్టులోకి ఎంపికయ్యారు. జట్టు సమతూకం కోసమే శార్దూల్‌, అక్షర్‌లను ఎంచుకున్నామని రోహిత్‌ శర్మ తెలిపాడు.


Comment As:

Comment (0)