Modi KTR

లోక్ సభలో మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

తెలంగాణపై మీకెందుకు అంత అక్కసు - మోదీని ప్రశ్నించిన కేటీఆర్

హైదరాబాద్ రిపోర్ట్- పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు మరోసారి దిగ్భ్రాంతి కలిగించాయని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించడం ఇదేం మొదటిసారి కాదని వ్యాఖ్యానించారు. మోదీ.. తెలంగాణ విరోధి, తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకు.. అని కేటీఆర్ ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరు పెట్టి.. విషం చిమ్మడం ఏం సంస్కారమని నిలదీశారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు, మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా అని ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు కేటీఆర్.

ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబందించిన తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని కేటీఆర్ ప్రశ్నింతారు. పోరాడి దేశాన్ని ఒప్పించి, మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకని ప్రధాని మోదీని నిలదీశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారని మోదీపి కేటీఆర్ మండిపడ్డారు.

తెలంగాణలోని కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌ కు తరలించుకుపోయి మా దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా అని మోదీని నిలదీశారు కేటీఆర్. 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి ఇవ్వకుండా గుండు సున్నా చేశారంటే.. మీకు తెలంగాణపై ఎంత కోపమో కదా అని ప్రశ్నించారు. పైన అప్పర్ భద్ర, కింద పోలవరం, ఇంకెక్కడో కెన్‌ బెత్వాకు జాతీయ హోదా ఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకని మోదీని నిలదీశారు. ఈడీ,ఐటీ, సీబీఐలను మీ ఎన్డీయే కూటమిలో చేర్చుకొని, ప్రతిపక్షాలపై ఉసిగొల్పి, ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్న మీరే.. పొద్దున లేచి ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం విచిత్రమని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
 


Comment As:

Comment (0)