KTR Etala Rajender

ఈటల రాజేందర్ కు భద్రత పెంచాలని చెప్పిన కేటీఆర్

హైదరాబాద్- హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్ పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సానుకూలంగా వ్యవహరించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ ఒకరిపై మరొకరు ఎక్కడలేని ప్రేమ కురిపించుకోవడం చర్చనీయాంశమవుతోంది. తనకు ప్రాణహాని ఉందని ఈటల రాజేందర్ తో పాటు ఆయన భార్య ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే మంత్రి కేటీఆర్ ఆయన భద్రతపై ఆరా తీశారు. 

వెంటనే డీజీపీ అంజనీ కుమార్‌ కు ఫోన్ చేసిన కేటీఆర్.. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్‌ తో సమీక్ష చేయించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సెక్యురిటీ పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుఫునే ఈటలకు భద్రత కల్పించాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు. ఇటు ఈటల రాజేందర్ సైతం తనకు బీఆర్ఎస్‌ తో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పడం విశేషం. బీఆర్ఎస్‌ పై గాని, కేసీఆర్‌తో గాని తనకు ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదని అన్నారు. 

బీఆర్ఎస్ నుంచి తనను వెళ్ళగొట్టినప్పుడు మంత్రి కేటీఆర్ సహా.. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా బాధపడి ఉంటారని ఈటల రాజేందర్ చెప్పడం ఆసక్తిరేపుతోంది. ఏదేమైనా ఇలా ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ లు ఒకరిపై ఒకరు పాజిటివ్ గా రెస్పాండ్ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.


Comment As:

Comment (0)