Lokesh Nara

తీవ్ర భావోద్వేగంతో లోకేశ్ ట్వీట్

కోపం కట్టలు తెంచుకుంటోంది.. నా రక్తం మరుగుతోంది - నారా లోకేశ్

విజయవాడ రిపోర్ట్- టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రిమాండ్ నేపధ్యంలో ఆయన తనయుడు నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌ చేయడం చూసి తన కోపం కట్టలు తెంచుకుంటోందని, రక్తం మరుగుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌  ఆదివారం ట్వీట్‌ చేశారు. కక్షసాధింపు చర్యలు, విధ్వంసక రాజకీయాలకు చంద్రబాబు ఎప్పుడూ పాల్పడలేదని ఈ సందర్బంగా అన్నారు. దేశం, రాష్ట్రం, తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన వ్యక్తి అని, ఇలాంటి అన్యాయాన్ని ఎందుకు భరించాలని ప్రశ్నించారు లోకేశ్. మన ప్రజల అభివృద్ధి, సంక్షేమం, అవకాశాలను ఆయన ఇతరుల కంటే ముందుగా ఊహించినందుకేనా.. అని ప్రశ్నించారు. బరువెక్కిన హృదయంతో, కన్నీటితో తడిసిన కళ్లతో ఈ రోజు ఇది రాస్తున్నానని.. ట్వీట్ చేశారు నారా లోకేశ్. (Lokesh tweet)

తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన శక్తిని ధారపోయడం చూస్తూ పెరిగానని చెప్పుకొచ్చారు. లక్షలాది మంది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆయనకు విశ్రాంతి రోజంటూ తెలియదని అన్నారు. చంద్రబాబు రాజకీయాలు ఎప్పుడూ హుందాతనంగా, నిజాయతీగా ఉంటాయని గుర్తు చేశారు లోకేశ్. చంద్రబాబు సేవలను పొందినవారి ప్రేమ, కృతజ్ఞతల నుంచి ఆయన ఆస్వాదించిన లోతైన ప్రేరణను చూశానని చెప్పారు. వాళ్ల హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనలో స్వచ్ఛమైన ఆనందాన్ని నింపాయని.. అవి పిల్లల ఆనందానికి సమానమైనవని భావోద్వేగంతో చెప్పారు. తాను ఆయన నుంచి ప్రేరణ పొంది అమెరికాలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని భారత్‌ కు తిరిగివచ్చానని గుర్తు చేసుకున్నారు. తనకు మన దేశం, వ్యవస్థలు, అన్నింటికిమించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉందని ట్వీట్‌ చెప్పుకొచ్చారు నారా లోకేశ్. 


Comment As:

Comment (0)