Pawan Ambati

పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన అంబటి

సినిమా టైటిల్స్ కోసం సెర్చ్ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు

స్పెషల్ రిపోర్ట్- పవర్ స్టార్, జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) తనని కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. పవన్ నటించిన బ్రో (BRO) సినిమాకు కలెక్షన్లు తగ్గుతుండటంతోనే నటీనటులతో తనపై విమర్శలు చేయించి పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. పవన్ బ్రో సినిమాలో నటుడు పృథ్వీ (Prudhvi), శ్యాంబాబు (Shyambaby) అనే క్యారెక్టర్ పాత్ర పోషించాడు. కధలో భాగంగా ఓ పబ్‌ లో డ్యాన్స్‌ చేస్తున్న శ్యాంబాబుపై పవన్‌ కళ్యాణ్ సెటైర్లు వేస్తారు. ఆ పాత్ర ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియో వైరల్ అవుతోంది.

దీనిపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ అవుతూ వస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. బ్రో సినిమాలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి సీన్‌ తీశారని, ఆ పాత్రను పవన్‌ కల్యాణ్‌ గారు దూషించి, కించపరిచే ఉద్దేశంతో సృష్టించారని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు అంబటి. బ్రో ఫ్లాప్‌ సినిమా అని, శ్యాంబాబు, రాంబాబు అంటూ ప్రచారం చేసుకుంటే ఇంకాస్త కలెక్షన్లు పెరుగుతాయని అనుకుంటున్నారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాలు ఇక ఆడవని గతంలో తాను చెప్పానన్న అంబంటి, వారాహి వంటి పవిత్ర పేరును తన వాహనానికి పెట్టుకుని, దానిపై ఎక్కి అబద్ధాలు, విమర్శలు చేస్తున్నారని, వారాహి అమ్మవారి శాపం తగులుతుందని అన్నారు.

ఇక సినిమా రంగంలో హీరోగా రాణించి, మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, రాజకీయాల్లోకి వచ్చిన ఓ వ్యక్తి కథతో మేము కూడా సినిమా చేయాలనుకుంటున్నామని పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ అన్నారు అంబటి రాంబాబు. ఆ సినిమాలకు ‘పెళ్లిళ్లు పెటాకులు’, ‘తాళి-ఎగతాళి’, ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’, ‘నిత్య పెళ్లి కొడుకు’, ‘బహు భార్య ప్రవీణ్యుడు’ పేర్లు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు.


Comment As:

Comment (0)