ktr vs sukhesh

వాడెవడో కూడా నాకు తెలీదు - సుఖేష్‌ ఆరోపణలపై కేటీఆర్‌ రియాక్షన్‌ 

హైదరాబాద్-న్యూఢిల్లీ- సుఖేష్‌ చంద్రశేఖర్ ఆరోపణలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. నేరస్థుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయని ఆయన చెప్పారు.  సుఖేష్ అనే వాడి గురించి తానెప్పుడూ వినలేదని, వాడెవడో కూడా తనకు తెలియదని కేటీఆర్ అన్నారు. సుఖేష్ అనే ఒక రోగ్ (పోకిరి) చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటానని కేటీఆర్‌ హెచ్చరించారు. సుకేష్ లాంటి మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని మీడియాకి విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.

ఇక సుఖేష్‌ చంద్రశేఖర్‌ తెలంగాణ  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కు సంచలన లేఖ రాశాడు. మనీలాండరింగ్‌ కేసులో తిహార్‌ జైలులో ఉన్న సుఖేష్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు- బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై ఈ లేఖలో పలు ఆరోపణలు చేశాడు. లిక్కర్ స్కామ్ కు సంబందించి తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్‌ సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని సుఖేష్ ఆరోపించారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆధారాలు  ఇవ్వాలని అడుగుతున్నారని చెప్పుకొచ్చాడు. ఆధారాలు ఇస్తే 100 కోట్ల నగదు, శంషాబాద్‌ వద్ద భూమి, అసెంబ్లీ సీటు ఇస్తామని ఆశపెడుతున్నారని లేఖలో పేర్కొన్నాడు.

లిక్కర్ స్కామ్ కు సంబందించి తన దగ్గర 2 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నాడు సుఖేష్. తనకు, కవితకు మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ అంతా రికార్డింగ్‌ ఉందని.. ఈ ఆధారాలను ఇప్పటికే ఈడీకి 65- బి సర్టిఫికెట్‌ రూపంలో ఇ‍చ్చానని తెలిపాడు. కవిత నుంచి 15 కోట్లు తీసుకొని కేజ్రీవాల్‌ తరపు వారికి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. దీంతో తెలంగాణ గవర్నర్ కు లేఖ రాసిన సుఖేష్ పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.


Comment As:

Comment (0)