Uttam Kumar Reddy

నీటి పారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు చేసినవారిపై కఠిన చర్యలు- ఉత్తమ్ 

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్‌ కుంగడం చాలా తీవ్రమైన అంశమని ఈ సందర్బంగా ఉత్తమ్ అన్నారు. మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన ఏజెన్సీని, అధికారులను పర్యటనలో తన వెంట ఉండేలా చూడాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల పరిస్థితితో పాటు అయా ప్రాజెక్టుల పెండింగ్ పనులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి ఈఎన్‌సీ మురళీధర్‌ రావు మంత్రికి వివరించారు. వచ్చేవారం నుంచి ప్రతి ప్రాజెక్టుపై విడివిడిగా సమీక్ష నిర్వహిస్తానని ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు.

మేడిగడ్డను ఎవరు నిర్మించినా, జరిగిన ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని ఉత్తమ్ తేల్చి చెప్పారు. ప్రాజెక్టు నిర్మించిన ఏజెన్సీతో పాటు అందుకు బాధ్యులైన అధికారులు జవాబుదారీలవుతారన్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పూర్తి వివరాలను సిద్ధం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు ఏవిధంగా నిర్మిస్తారని ప్రశ్నించిన ఉత్తమ్.. నిధులు ఎలా సమీకరించారని ఆరా తీశారు. నీటిపారుదల శాఖ పారదర్శకంగా, అవినీతికి ఏ మాత్రం తావు లేకుండా సమర్థంగా పనిచేయాలని చెప్పారు. నీటిపారుదల శాఖలో ఎదో జరిగిందని అందరిలో అనుమానాలు ఉన్నాయన్న ఉత్తమ్.. వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు తొందరగా దెబ్బతినడం ఆందోళనకరమని మంత్రి కామెంట్ చేశారు. త్వరలోనే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.


Comment As:

Comment (0)