Jagan Lokesh

వైఎస్ జగన్‌ అవినీతిపై మా దగ్గర ఆధారాలున్నాయి 

అవినీతి ఆరోపణలపై సీఎం జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం - లోకేశ్ సవాల్

నేషనల్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో (CM YS Jagan) బహిరంగ చర్చకు తాను సిద్ధమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రకటించారు. ప్రముఖ న్యూస్ ఛానల్‌ రిపబ్లిక్‌ టీవీలో శుక్రవారం రాత్రి జరిగిన చర్చలో ఆ సంస్థ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆర్ణబ్‌ గోస్వామి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు లోకేశ్. ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆర్ణబ్‌ గోస్వామి అడిగిన వివిధ ప్రశ్నలకు లోకేశ్‌ సమాధానాలిచ్చారు.  

చంద్రబాబు (Chandrababu) ఎలాంటి అవినీతీ చేయలేదని చెప్పడానికి తమ దగ్గర డాక్యుమెంటరీ సాక్ష్యాలు ఉన్నాయని ఈ సందర్బంగా లోకేశ్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భహిరంగ చర్చ ఏర్పాటు చేస్తే ఆయన చేసిన అవినీతిని నిరూపిస్తానని లోకేశ్ సవాల్‌ విసిరారు. ఆర్థిక శాఖ అధికారులు రాసిన ఫైల్‌ నోట్స్ ను పట్టించుకోకుండా, టెండర్లు లేకుండా ఈ ప్రాజెక్టు అప్పగించారని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న అంశాలను లోకేశ్‌ తోసిపుచ్చారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు, మంత్రివర్గ ఆమోదం, తదితర అంశాలపై స్పష్టమైన సమాధానాలు చెప్పారు లోకేశ్,

ఏపీ కంటే ముందు గుజరాత్‌ సహా ఏడు రాష్ట్రాలు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును అమలు చేశాయని లోకేశ్ గుర్తు చేశారు. కంపెనీలు నాలెడ్జ్‌ రూపంలో 90 శాతం వాటా అందించే ప్రాజెక్టు ఇంతవరకు ఎప్పుడూ లేదని, వారు అందించిన సాఫ్ట్‌ వేర్‌, ఇతర పరికరాల విలువను కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ పరిధిలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (CITD) మదించి, ఆ ప్రాజెక్టుకు అంతమేర విలువ ఉందని చెప్పిందని లోకేశ్ స్పష్టం చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కు మంత్రివర్గ అనుమతి లేదని చెప్పడం పచ్చి అబద్ధమని, దానికి 2015 ఫిబ్రవరి 16న క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని స్పష్టం చేశారు నారా లోకేశ్.


Comment As:

Comment (0)