No Confidence Motion

మోదీ సర్కార్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే

న్యూ ఢిల్లీ- మోదీ (PM Modi) సర్కార్ పై విపక్షాలు లోక్ సభ (Loksabha) లో అవిశ్వాస తీర్మాణాన్ని (No Confidence Motion) ప్రవేశపెట్టాయి. కేంద్రంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమిలో భాగమైన కాంగ్రెస్‌ (Congress), బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ వేర్వేరుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను లోక్‌ సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)  అనుమతించారు. దీనిపై అన్ని పార్టీలతో చర్చించి చర్చ, ఓటింగ్ పై తేదీని ప్రకటిస్తానని స్పీకర్‌ ప్రకటించారు. 

ఇక ఇండియా కూటమి, బీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వం లోక్‌సభలో ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది. సభలో ఎన్డీయే కూటమి తమ మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉండగా, తమకు పూర్తి మెజార్టీ ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల అవిశ్వాస తీర్మానం బల పరీక్షలో విఫలమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినప్పటికీ ప్రతిపక్ష కూటమి దీనిని ప్రయోగిస్తుంది. అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్‌లో మణిపూర్‌ అంశంపై తప్పక ప్రధాని మోదీ మాట్లాడటంతో పాటు, తమకు పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే యోచనతో విపక్ష కూటమిఅవిశ్వాస తీర్మాణ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.

ఇక లోక్‌ సభలో మొత్తం 543 సీట్లు ఉండగా, అందులో ప్రస్తుతం 6 సీట్ల ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం లోక్ సభలో మొత్తం 537 మంది ఎంపీలున్నారు. ఎన్డీయే కూటమి కి మొత్తం 331 ఎంపీల బలం ఉంది. బీజేపీకి సొంతంగానే 303 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమి బలం 144, బీఆర్‌ఎస్‌, బీజేడీ, వైఎస్సార్‌ సీపీ కి కలిపి 70 మంది ఎంపీల బలం ఉంది. అయితే లోక్‌ సభలో 64 మంది తటస్థ ఎంపీలు ఉన్నారు. ఇక లోక్‌సభలో అవిశ్వాస తీర్మాణం ఎదుర్కొంటున్న ఎన్డీఏ కూటమికి అనుకూలంగా 273 మంది ఎంపీల మద్దతు తెలిపితే అవిశ్వాస తీర్మానం ఈజీగా వీగిపోతుంది. కాబట్టి విపక్షాల అవిశ్వాస తీర్మాణం చివరికి వీగిపోవడం ఖాయమని ముందే తెలిసిపోతుంది.
 


Comment As:

Comment (0)