Narendra Modi

అవిశ్వాసంపై లోక్‌సభలో ప్రసంగించిన మోదీ 

కాంగ్రెస్ పార్టీకి అంత స్థాయి లేదు- ప్రధాని మోదీ

పార్లమెంట్ రిపోర్ట్- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రతిపక్ష పార్టీలపై (I.N.D.I.A) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మాణంపై ((No confidence Motion)) చర్చ సందర్బంగా ప్రధాని విపక్షాలపై ఫైర్ అయ్యారు. విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని మోదీ అన్నారు. వారి అవిశ్వాస తీర్మానాలతో తమ ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. విపక్షం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాసం తమకు ఎప్పటికీ అదృష్టమేనన్నారు ప్రధాని. 

మేం మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని విపక్షాలు నిర్ణయించాయి. అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాయి.. అని మోదీ అన్నారు. తమపై నమ్మకం ఉంచిన కోట్లాది భారతీయులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. 2018లో సైతం తమ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారని గుర్తు చేసిన మోదీ.. ప్రజలు అనేకసార్లు తమపై విశ్వాసం చూపించారని చెప్పారు. విపక్షాలు వరుస నోబాల్స్‌ వేస్తుంటే.. అధికార పక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోందని క్రికెట్‌ భాషలో చెప్పారు మోదీ. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

విపక్షాలకు పేదల గురించి ఆలోచన లేదన్న ప్రధాని, అధికారంలోకి రావడమే వారి పరమావధని విమర్శించారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఏం సాధించారని మోదీ విపక్షాలను ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ప్రజల మీద,  దేశం మీద, వ్యవస్థల మీద విశ్వాసం లేదని అన్నారు. త్వరలోనే ప్రపంచంలో భారత్‌ మూడో ఆర్థికశక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఆలోచన లేదన్న మోదీ, అంత స్థాయి కూడా లేదని కామెంట్ చేశారు. ప్రతిదాన్ని విమర్శించడం తప్ప.. ఆర్థిక వ్యవస్థ పట్ల, దేశం పట్ల కాంగ్రెస్‌కు దిశదశ లేదని అన్నారు.
 


Comment As:

Comment (0)