Police

ఉద్యోగినిని లైంగికంగా వేధించడంతో సీఐడీ డీఎస్పీ కిషన్‌సింగ్‌పై కేసు.

నన్ను కౌగిలించుకుంటే సాయం చేస్తా - మహిళా ఉద్యోగినికి డీఎస్పీ వేధింపులు

హైదరాబాద్ క్రైం రిపోర్ట్- హైదరాబాద్ విద్యుత్‌ శాఖ మహిళా ఉద్యోగికి (Female Employee) లైంగికంగా వేధించిన వ్యవహారంలో సీఐడీ డీఎస్పీ కిషన్‌ సింగ్‌ (Kishan Singh) పై కేసు నమోదైంది. మొబైల్ ఫోన్‌ లో అసభ్యకర మెస్సేజ్ (Indecent Message) లు పంపిస్తూ తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌లో సెక్షన్‌ 354 (సీ) కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ మహిళకు రెండేళ్ల క్రితం అంబర్‌పేట పీటీసీలో డీఎస్పీగా పనిచేస్తున్న కిషన్‌ సింగ్‌ పరిచయమయ్యాడు. దీంతో మహిళతో మాట కలిపిన డీఎస్పీ, తరుచుగా ఆమెకు వాట్సాప్ లో హిందీ సినిమా పాటలు, ఇతర వీడియోలతో పాటు అసభ్యకరమైన మెస్సేజ్ లు పంపేవాడు.

ఇలాంటివి తనకు ఎందుకు పంపిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించినా డీఎస్పీ తీరులో మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన మహిళ.. డీఎస్పీ పంపే మెస్సేజ్ లకు రిప్లై ఇవ్వడం మానేసింది. సుమారు సంవత్సరం తరువాత తాజాగా ఓ కేసు విషయంలో తనకు సాయం చేయాలంటూ ఆ మహిళ ఉద్యోగి డీఎస్పీకి ఫోన్‌ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకున్న డీఎస్పీ.. తనతో స్నేహం చేయాలని, తనను కౌగిలించుకుంటే అన్ని విధాలా సాయం చేస్తానని తన మనసులో ఉన్న దుర్బుద్దిని బయటపెట్టాడు. లేదంటే తనకు దూరంగా ఉండాలని, తనకు ఫోన్‌ చేయొద్దని ఆమెతో చెప్పాడు. డీఎస్పీ వేధింపులకు మనస్తాపం చెందిన మహిళా ఉద్యోగి ఈ నెల 28న రాచకొండ షీటీమ్స్ కు పిర్యాదు చేసింది. కంప్లైంట్ తీసుకున్న చైతన్యపురి పోలీసులు డీఎస్పీపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


Comment As:

Comment (0)