Pragyan Rover Escaped

పెద్ద గొయ్యిని తప్పించుకున్న రోవర్‌

చంద్రుడిపై పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రగ్యాన్

ఇంటర్నేషనల్ డెస్క్- చందమామపై పరిశోధనలు చేస్తున్న చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రజ్ఞాన్‌ రోవర్‌ (Pragyan Rover) పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. సమీపంలోని గోతిలో పడకుండా చాకచక్యంగా వ్యవహరించింది. ఆదివారం ప్రగ్యాన్ రోవర్ వాహనం ప్రయాణిస్తున్న మార్గంలో నాలుగు మీటర్ల వెడల్పున్న ఒక గొయ్యి కనిపించింది. లోతైన ఆ బిలానికి మూడు మీటర్ల దూరంలోనే రోవర్‌ వెళ్తోంది. ప్రజ్ఞాన్‌ రోవర్ లోని నేవిగేషన్‌ కెమెరాలు దాన్ని కనిపెట్టేశాయి. ఆ వెంటనే అప్రమత్తమయ్యారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తలు. సురక్షితమైన మరో మార్గంలో ప్రయాణించేలా ప్రగ్యాన్ రోవర్‌ కు ఆదేశాలిచ్చారు.

ఆ పెద్ద గొయ్యి ఫొటోతో పాటు కొత్త మార్గంలో ప్రజ్ఞాన్‌ ప్రయాణించిన గుర్తులతో కూడిన చిత్రాలనూ ఇస్రో విడుదల చేసింది. చంద్రుడిపై ప్రజ్ఞాన్‌ రోవర్ ప్రయాణం సవాళ్ల మధ్య కొనసాగుతోందనడానికి ఈ ఉదంతమే నిదర్శనంగా చెప్పుకోవాలి. నేవిగేషన్‌ డేటా, స్వీయ నియంత్రణపరంగా ఉన్న కొన్ని పరిమితుల కారణంగా రోవర్‌ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తోందని ఇస్రో పేర్కొంది. అంతకు ముందు  శనివారం 100 మి.మీ.ల లోతున్న చిన్న గొయ్యిని గుర్తించినా విజయవంతంగా దాన్ని దాటేసింది ప్రగ్యాన్ రోవర్. సెప్టెంబర్ 7వ తేదీ వరకు ప్రగ్యాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) సమర్ధవంతంగా పనిచేస్తాయని, వీలైనంతవరకు చంద్రుడిపై పరిశోధనలు కొనసాగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


Comment As:

Comment (0)