Pragnan

చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్‌ ఉనికి లభ్యం

చందమామపై సల్ఫర్‌.. ప్రజ్ఞాన్ రోవర్‌ పరిశోధనలో వెల్లడి

ఇంటర్నేషనల్ రిపోర్ట్- చంద్రుడిపై పరిశోధనల (Moon Mission) కోసం భారత అంతర్జాతీయ పరిశోధన సంస్థ - ఇస్రో (ISRO) ప్రయోగించి చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయవంతంగా పనిచేస్తోంది. మూన్ మిషన్‌లో భాగంగా చందమామపై సక్సెస్ ఫుల్ గా తిరుగుతున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ (Pragnan Rover) జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలో మరికొన్ని ముఖ్యమైన అంశాలను కనుగొంది. ప్రజ్ఞాన్ లోని లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ (LIBS) చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై సల్ఫర్ (S) ఉనికిని గుర్తించినట్లు ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు తెలిపారు.

సల్ఫర్ తో పాటు క్రోమియం (Cr), టైటానియం (Ti), సిలికాన్‌ (Si), మాంగనీస్‌ (Mn), ఆక్సిజన్‌ (O),అల్యూమినియం (Al), కాల్షియం (Ca), ఫెర్రమ్‌ (ఇనుము Fe) మూలకాలను సైతం గుర్తించినట్లు ఇస్రో పేర్కొంది. మరింత లోతుగా హైడ్రోజన్‌ (H) కోసం ప్రజ్ఞాన్ రోవర్ అన్వేషన కొనసాగిస్తోందని ఇస్రో స్పష్టం చేసింది. చంద్రుడిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేయడంతో పాటు అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకు ప్రజ్ఞాన్ రోవర్ లో లిబ్స్‌ (libs spectroscopy) పరికరాన్ని పంపించారు. ఈ పరికరాన్ని బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ ప్రయోగశాల (LEOS) లో అభివృద్ధి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఇది కూడా మరో రెండు రోజుల్లో తన పరిశోధనలకు సంబందించిన వివరాలను పంపించనుందని తెలుస్తోంది.


Comment As:

Comment (0)