KTR Revanth

ఎక్కడికి రావాలో మంత్రి కేటీఆర్‌ చెప్పాలి- రేవంత్

బీఆర్ఎస్ సవాల్ ను స్వీకరించిన రేవంత్ రెడ్డి

పొలిటికల్ రిపోర్ట్- తెలంగాణ (Telangna) లో విద్యుత్ రాజకీయం తారా స్థాయికి చేరింది. ఉచిత విద్యుత్ పై అధికార బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మరోసారి చెప్పారు. దీన్ని నిరూపించేందుకు తాను రెడీ అని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ను సింగిల్‌ ఫేజ్‌గా ఇస్తున్నట్లు ట్రాన్స్‌ కో సీఎండీ ప్రభాకర్ గతంలో చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రైతులకు త్రీ ఫేజ్‌ కరెంట్‌పై నియంత్రణ పాటిస్తున్నామని, 8 నుంచి 10 గంటలే ఇస్తున్నట్లు అధికారులే చెప్పారని రేవంత్‌ చెప్పారు. ట్రాన్స్‌ కో లాగ్‌ బుక్స్‌ ప్రకారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఈ విషయాన్ని నిరూపించారని అన్నారు.

వ్యవసాయం కోసం రైతులు సింగిల్‌ ఫేజ్‌ మోటార్లు ఉపయోగించరని రేవంత్‌ రెడ్డి చెప్పారు.ప్రజావేదిక వద్ద చర్చకు రావాలని బీఆర్ఎస్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని చెప్పిన రేవంత్, ఎక్కడికి రావాలో మంత్రి కేటీఆర్‌ (KTR) చెప్పాలని ప్రతి సవాల్ విసిరారు. తెలంగాణలో విద్యుత్‌ కొనుగోలు కోసం ప్రతి సంవత్సరం 16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారని చెప్పిన రేవంత్, అందులో 8వేల కోట్లు బీఆర్ఎస్ నేతలే దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉచిత విద్యుత్ ను ఎక్కువ గంటలు చూపిస్తూ కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని మాత్రమే తాను చెప్పానని, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇవ్వట్లేదని ఎక్కడైనా నిరూపించేందుకు నేను సిద్ధమని అన్నారు.

సిద్దిపేట, సిరిసిల్ల, చింతమడక.. ఇలా తెలంగాణలో ఎక్కడైనా కేటీఆర్‌ చెప్పిన చోటుకు వచ్చి నిరూపిస్తానని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. కేంద్రం తక్కువ ధరకే విద్యుత్‌ అమ్ముతానంటే కేసీఆర్ సర్కార్‌ కొనుగోలు చేయడం లేదన్న ఆయన.. గతంలో కాంగ్రెస్‌ చేపట్టిన చర్యల వల్ల 2014 నుంచి దేశవ్యాప్తంగా కూడా విద్యుత్‌ సామర్థ్యం పెరిగిందని చెప్పారు.ఛత్తీస్‌ గఢ్‌ నుంచి జరిగిన విద్యుత్‌ కొనుగోళ్లలోనూ కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.


Comment As:

Comment (0)