CM Revanth Reddy

ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌ రెడ్డి ప్రమాణం

తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ రాష్ట్రంలో గురువారం కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. హైదరాబాద్‌ లోని లాల్ బహదూర్ స్టేడియంలో కనులపండువగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణా స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డితో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఆ తరువాత మల్లు భట్టివిక్రమార్క డిప్యూటీ సీఎంగా, మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఏఐసీసీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అధికార, అనధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు, సామాన్య ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొదలుపెట్టి.. రేవంత్ రెడ్డి అనే నేను అని చెప్పగానే.. కార్యకర్తలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు.

ప్రమాణం తరువాత వేదికపై ఉన్న పార్టీ అగ్రనేత సోనియా గాంధీ వద్దకు ఆయన వెళ్లి పాదాభివందనం చేశారు రేవంత్ రెడ్డి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు రేవంత్ రెడ్డిని అభినందించారు. ఆ తరువాత తెలంగాణ డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు.

అందరూ తెలుగులే ప్రమాణం చేయగా, దామోదర రాజనరసింహా మాత్రం ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఆత్మసాక్షిగా ప్రమాణం చేయగా, మిగిలిన వారంతా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం తరువాత మంత్రులు గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్, సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గేల దగ్గరకు వెళ్లి నమస్కరించారు. కొండా సురేఖ, సీతక్క లను సోనియా గాంధీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతో వారు కొంత భావోద్వేగానికి గురయ్యారు. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను రేవంత్‌ను ఆలింగనం చేసుకున్నారు. 


Comment As:

Comment (0)