yevgeny Prigozhin

త్వరలో రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారు

ఊహించని ఎదురుదెబ్బ- త్వరలో రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారు

ఇంటర్నేషనల్ డెస్క్- రష్యాలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. వాగ్నర్ గ్రూప్‌ (wagner mercenary group) తిరుగుబాటుతో రష్యాలో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాగ్నర్ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్ (yevgeny Prigozhin) రష్యా ప్రజలను వెన్నుపోటు పొడిచాడని అధ్యక్షుడు పుతిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐతే తమ విషయంలో అధ్యక్షుడు పుతిన్ పొరపాటు పడ్డారని, తాము నిజమైన దేశభక్తులమని ప్రిగోజిన్‌ కౌంటర్ ఇచ్చాడు. అంతే కాదు ఈ దేశానికి కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రిగోజిన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. 

వాగ్నర్ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. మేము ఎవరికీ ద్రోహం చేయలేదు. అధ్యక్షుడు పుతిన్ పొరబడ్డారు. మేం దేశభక్తులం. మాలో ఒక్కరూ కూడా లొంగిపోవడం లేదు. ఎందుకంటే మేం ఈ దేశాన్ని అవినీతి, అబద్ధాలు, బ్యూరోక్రసీలో మగ్గిపోవాలని కోరుకోవడం లేదు. పుతిన్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారు.. అని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో వాగ్నర్ సైనిక దళాలు రష్యా దక్షిణ ప్రాంత నగరాల నుంచి ముందుకు సాగుతున్నట్లు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

వాగ్నర్‌ సేనలను నిలువరించేందుకు సొంత నగరంపైనే బాంబులు కురిపించింది రష్యా. వొరొనెజ్‌ లోని ఆయిల్ రిఫైనరీ, డిపోపై బాంబు దాడి చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజా పరిణామాల నేపథ్యంలో పుతిన్‌కు రష్యా పార్లమెంట్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఇన్నాళ్లు ఉక్రెయిన్‌ లోని నగరాలపై బాంబుల వర్షం కురిపించిన రష్యా, ఇప్పుడు సొంత నగరంపైనే దాడి చేయాల్సిన పరిస్థితి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 


Comment As:

Comment (0)