TSPSC

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు సరైందే- హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు

తెంలగాణ ప్రభుత్వానికి చుక్కెదురు - గ్రూప్-1 రద్దు సరైందేనన్న హైకోర్టు

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. తెంలగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్- టీఎస్‌పీఎస్సీ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కేసులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు సరైందేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 (Group-1) ప్రిలిమ్స్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిందేనని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ చేసిన అప్పీల్‌ ను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. 

టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌ లు దాఖలు చేశారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని పిటీషన్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్ -1 అభ్యర్థుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టారు. ప్రిలిమ్స్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ ని ఆదేశించారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ టీఎస్‌పీఎస్సీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది.

టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు (Telangana High Court) డివిజన్‌ బెంచ్‌.. టీఎస్‌పీఎస్సీ తీరును తప్పుబట్టింది. ప్రశ్న పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తున్నపుడూ మళ్లీ అదే నిర్లక్ష్యమా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా అని ప్రశ్నించిన ధర్మాసనం.. బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొని దాన్ని ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీఎస్‌పీఎస్సీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. విచారణ తరువాత సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చింది హైకోర్టు డివిజన్ బెంచ్.


Comment As:

Comment (0)