botsa srinivas goud

తెలంగాణ వర్సెస్ ఆంధ్ర - మంత్రుల మధ్య మాటల యుధ్దం

అమరావతి-హైదరాబాద్- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల మధ్య చాలా విషయాల్లో వివాదాలు నెలకొన్నాయి. విభజన హామీల  నుంచి మొదలు నీటి వాటాలు, బకాయిల వరకు ఎన్నో అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా విద్యా వ్యవస్థకు సంబందించి రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. ఇందుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఆజ్యం పోశాయని చెప్పాలి.

తెలంగాణ (Telangana) విద్యా వ్యవస్థపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్‌ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదని కామెంట్ చేశారు. అంతే కాదు అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణదని వ్యాఖ్యానించారు బొత్స. మన విధానం మనది, మన ఆలోచనలు మనవి అని తనదైన స్టైల్లో అన్నారు.

బొత్స సత్యనారాయణ తెలంగాణ (Telangana) విద్యా వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రస్తాయిలో మండిపడుతున్నారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చూసి రాసి పరీక్షలు పాస్‌ అయ్యారు కాబట్టే అలా అంటున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ (Srinivas Goud) ఫైర్ అయ్యారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేనితనంతో, అక్కసుతో బొత్స మాట్లాడతున్నారని ఆయన కామెంట్ చేశారు. తాము తెలంగాణలోనే చదువుకుంటామని ఏపీ విద్యార్థులు కోర్టుకు వెళ్లిన ఘటనలను శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని పరీక్షల్లో అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణపై అనవసరంగా ఎందుకు అలా విషం కక్కుతున్నారని ప్రశ్నించిన మంత్రి.. వారి హయాంలో ఏపీపీఎస్సీలో స్కాములు జరిగేవని, ఇప్పుడు కూడా అలానే అనుకుంటే ఎలా అని నిలదీశారు. 

తెలంగాణలో వోక్స్‌ వ్యాగన్‌ స్కాములు ఉన్నాయా అని ప్రశ్నించారు శ్రీనివాస్‌ గౌడ్‌. ఏపీలో ఆలయాల వద్ద కూడా వివక్ష ఉందన్న ఆయన... అంతా కులపిచ్చి తప్ప అభివృద్ధి లేదన్నారు. అన్ని విషయాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని బొత్స సత్యనారాయణకు సవాల్‌ విసిరారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో వెంటాడి దోషులను అరెస్టు చేస్తున్నామని, పారదర్శకంగా ఉండాలన్న ప్రభుత్వ చర్యలు హర్షించాలని హితువు పలికారు. తెలంగాణను కించపర్చేలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించిన శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణపై అక్కసు వెల్లబోయడం మానేసి ఏపీ అభివృధ్ధిపై దృష్టి సారించాలని సూచించారు.


Comment As:

Comment (0)