Sandhya Reddy

స్ట్రాత్‌ ఫీల్డ్‌ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌గా తెలుగు మహిళ

ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌ గా తెలంగాణ మహిళ

ఇంటర్నేషనల్ రిపోర్ట్- తెలుగు మహిళ ఖండాంతరాలు దాటి మన దేశ సత్తా చాటారు. ఆస్ట్రేలియాలోని (Australia) న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రం సిడ్నీ సిటీలోని స్ట్రాత్‌ ఫీల్డ్‌ (Strathfield) పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌ గా తెలుగు మహిళ ఎన్నికయ్యారు. కర్రి సంధ్యారెడ్డి (శాండీ రెడ్డి) (Karri Sandhya Reddy) స్ట్రాత్‌ ఫీల్డ్‌ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌ గా గురువారం ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ సంతతి మహిళగా ఆమె రికార్డ్ నెలకొల్పారు. హైదరాబాద్‌ లోని ఖైరతాబాద్‌ కు చెందిన సంధ్యారెడ్డి స్థానిక స్టాన్లీ కళాశాలలో ఇంటర్మీడియట్‌ వరకు చదివారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో న్యాయవాద పట్టా పొందారు. ఉస్మానియాలో యూనివర్సిటీలో ఎంఏ చదివారు. ఆమె తల్లిదండ్రులు పట్లోళ్ల శంకర్‌ రెడ్డి, సారారెడ్డి. 1991లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కర్రి బుచ్చిరెడ్డితో వివాహం కాగా భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు సంధ్యారెడ్డి.

అక్కడి ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్‌ లా డిగ్రీ పొందారు. ఆ తరువాతి క్రమంలో ఆమె ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాదిగా పనిచేశారు. ఆమె చొరవతో భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం స్ట్రాత్‌ ఫీల్డ్‌ (Strathfield) లోని హోమ్‌ బుష్‌ కమ్యూనిటీ సెంటర్‌లో ఏర్పాటయింది. భర్తతో కలిసి విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంధ్యారెడ్డి. ఈ క్రమంలో 2021లో సంధ్యారెడ్డి నివాసం ఉండే స్ట్రాత్‌ ఫీల్డ్‌ పురపాలక సంఘానికి ఎన్నికలు జరిగాయి. స్థానికంగా ఉన్న ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియా వాసులు సైతం పోటీ చేయాలని సంధ్యారెడ్డిని కోరారు. స్థానిక లేబర్‌, లిబరల్‌ పార్టీల అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థినిగా పోటీచేసి ఆమె విజయం సాధించారు. ఈ పురపాలక సంఘానికి ప్రతి సంవత్సరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు జరుగుతాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో సంధ్యారెడ్డి డిప్యూటీ మేయర్‌ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


Comment As:

Comment (0)