Tiger Nageswara Rao

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మూవీ ఎలా ఉందంటే

రవితేజ “టైగర్‌ నాగేశ్వరరావు” రివ్యూ

సినిమా- టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao Movie Review)

తారాగణం- రవితేజ, అనుపమ్‌ ఖేర్‌, నుపుర్‌ సనన్‌, రేణు దేశాయ్‌, జిషుసేన్‌ గుప్త, మురళీ శర్మ, గాయత్రీ భరద్వాజ్‌, నాజర్‌ తదితరులు 

మ్యూజిక్- జీవీ ప్రకాష్‌ కుమార్‌

సినిమాటోగ్రఫీ- ఆర్‌.మది 

ఎడిటింగ్‌- కోటగిరి వెంకటేశ్వరరావు 

నిర్మాత- అభిషేక్‌ అగర్వాల్‌ 

రచన, మాటల- శ్రీకాంత్‌ విస్సా 

దర్శకత్వం- వంశీ 

విడుదల తేదీ-20-10-2023 (శుక్రవారం)

పరిచయం... Tiger Nageswara Rao Movie Review

మాస్ మహారాజ రవితేజ (Ravi tej) సంవత్సరానికి ఖచ్చితంగా రెండు మూడు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులోను దసరాకు ఓ సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు రవితేజ. తాజాగా వంశీ దర్శకత్వంలో రవితేజ నటించిన సినిమా టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao). స్టూవర్టుపురం కు చెందిన ప్రముఖ దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దసరా బరిలో నిలిచిన టైగర్‌ నాగేశ్వరరావు ఎలా ఉంది, రవితేజ తొలి పాన్‌ ఇండియా సినిమా ప్రేక్షకులను మెప్పించిందా....

టైదర్ నాగేశ్వర్ రావు కధ.. Tiger Nageswara Rao Movie Review

50 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టూవర్టుపురం నాగేశ్వ‌ర‌రావు పేరు వింటే ఓ వైపు ప్ర‌జల్లో, మరోవైపు పోలీసుల్లోను గుండె దడ. దొంగతనాలకు పెట్టింది పేరైన నాగేశ్వ‌ర‌రావు కన్నుప‌డిందంటే చాలు, ఎంత విలువైన‌దైనా, ఎంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉన్నా దేచేస్తాడని పేరు. తాను దోపిడీలు చేసే ప్రాంతాన్ని టైగ‌ర్ జోన్ గా, అత‌డి పేరు నాగేశ్వ‌ర‌రావుగా ఉండటంతో అతన్ని అంతా టైగర్ నాగేశ్వర్ రావు అనీ పిలుస్తుంటారు. అదిగో అంత పేరు మోసిన గజ దొంగ క‌థ‌తో రూపొందిన సినిమానే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. టైటిల్ పాత్ర‌లో మాస్ మహారాజ ర‌వితేజ న‌టించారు. ఇక టైగర్ నాగేశ్వర్ రావు కధ 1980 నేప‌థ్యంలో ప్రారంభమవుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని స్టూవ‌ర్టుపురం ఊరిక్ చెందిన నాగేశ్వ‌ర‌రావు గురించి దేశరాజధాని దిల్లీలో చ‌ర్చతో సినిమా కధ మొదలవుతుంది. ప్ర‌ధాన మంత్రి భ‌ద్ర‌తని స‌మీక్షించే ఇంటిలిజెన్స్ అధికారి రాజ్‌పుత్ (అనుప‌మ్ ఖేర్‌) స్టూవర్టుపురం గురించి తెలిసిన పోలీస్ అధికారి విశ్వ‌నాథ్ శాస్త్రి (ముర‌ళీశ‌ర్మ‌)ని పిలిపించి నాగేశ్వ‌ర‌రావు గురించి ఆరా తీస్తాడు. ప్రధాని సెక్యూరిటీ అధికారి నాగేశ్వర్ రావు గురించి ఎందుకు ఆరా తీస్తాడు? అందుకు కార‌ణ‌మేంటి? అస‌లు ఈ దొంగతనాలకు పాల్ప‌డుతున్న టైగర్ నాగేశ్వ‌ర‌రావు ప్రధాన లక్ష్యమేంటి? ఇవన్నీ తెలియాలంటే టైగర్ నాగేశ్వర్ రావు ధియోటర్ లో చూడాల్సిందే.

టైగర్ నాగేశ్వర్ రావు మూవీ ఎలా ఉందంటే.. Tiger Nageswara Rao Movie Review

టైగర్ నాగేశ్వర్ రావు సినిమా బ‌యోపిక్‌ గానే ప్ర‌చారమైనా, ప్ర‌చారంలో ఉన్న విష‌యాల్ని ఆధారంగా చేసుకునే రూపొందించారు. ఈ సినిమాలో వాస్త‌వాల కంటే క‌ల్పితాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ఐతే కల్పితమైన కధే అయినా దర్శకుడు చూపించే విధానాన్ని బట్టి ప్రేక్షకుడికి నచ్చుతుందో లేదో తెలుస్తుంది. టైగర్ నాగేశ్వర్ రావు సినిమా కొంత వ‌ర‌కు ప‌ర్వాలేద‌నిపించినా, క్రమంగా కధ గాడి తప్పిందని అనిపించకమానదు. ర‌క్తం, క‌న్నీరు క‌లిసిన సిరాతో రాసిన చ‌రిత్ర అని చెప్పినా ఇందులో రక్త‌పాత‌మే త‌ప్ప క‌న్నీళ్లు పెట్టించే భావోద్వేగాలు పెద్దగా కనిపించవు. టైగర్ నాగేశ్వ‌ర‌రావు దొంగ‌త‌నాలపై క‌థ‌లు క‌థ‌లుగా వినిపించే సన్నివేశాలనైనా థ్రిల్ క‌లిగించేలా తెర‌పైకి చూపించలేకపోయాడు డైరెక్టర్. కేవలం ఓ దొంగ ప్ర‌ధాన‌ మంత్రి సీటు వ‌ర‌కూ వెళ్లాడ‌న్న‌ప్పుడు అత‌నిలో ఎంత ధైర్యం, ఎన్ని తెలివితేట‌లు ఉండాలి. కానీ అలాంటి సాహ‌సాల్ని, తెలివి తేట‌ల్ని నాగేశ్వ‌ర‌రావు దోపిడీల‌లో ఎక్క‌డా చూపించ‌లేదు.

సినిమా ప్రారంభంలో రైలు దోపిడీ చూపించారు కానీ అది ఏమాత్రం స‌హ‌జంగా అనిపించ‌దనే చెప్పాలి. కానీ కొంతవరకు విజువ‌ల్స్ మాత్రం ఆక‌ట్టుకుంటాయి. స్టూవర్టుపురం నేర సామ్రాజ్యంతో ప్రారంభమయ్యే ఈ క‌థ‌లో కొన్ని స‌న్నివేశాలు  ఆకట్టుకుంటాయి. టైగర్ నాగేశ్వర్ రావు దొంగ‌త‌నాల కోసం స‌న్న‌ద్ధమ‌య్యే తీరు, స్వార్థ‌ప‌రుల వ‌ల్ల దొంగ‌త‌నాలు చేయాల్సిన ప‌రిస్థితులు రావ‌డం వంటి స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడిని క‌థ‌లో తీసుకెళ్తాయి. ఐతే అది ఎంతో సేపు ఉండదు. ఆ వెంట‌నే సినిమా ఫ‌క్తు క‌మ‌ర్షియల్ ఫార్మాట్‌ లోకి వెళ్లిపోతుంది. కధతో సంబంధం లేకుండా పోలీసుల‌తో ఫైట్‌,  హీరోయిన్‌తో ప్రేమతో క‌థ‌ సైడ్ ట్రాక్ పడుతుంది. సెకండ్ హాఫ్ లో త‌ల‌లు తెగిప‌డుతూ స‌న్నివేశాలు సాగుతూనే ఉంటాయి త‌ప్ప క‌థ ఎక్క‌డా ఆస‌క్తి కలిగించదు. పెళ్లి, పిల్ల‌లు, ఫ్యాక్ట‌రీ అంటూ ద్వితీయార్ధంలో సుదీర్ఘ‌మైన మ‌రో క‌థ న‌డుస్తుంది. స్టూవర్టుపురం ప్రజల జీవితాల్లో మార్పు కోసం ప‌నిచేసిన హేమ‌ల‌తా ల‌వ‌ణం పాత్ర‌ని కూడా  ఆకట్టుకునేలా చూపించ‌లేదు. 80 ద‌శ‌కంలో సాగే ఈ సినిమాలో ర‌వితేజ, ఇత‌ర పాత్ర‌ధారులు  కొన్ని సార్లు ట్రెండీగా క‌నిపిస్తే మ‌రికొన్నిసార్లు చారిత్రాత్మ‌క సినిమాల్లోలాగా క‌నిపిస్తారు. దర్శకుడు క‌థ‌, క‌థ‌నాల్ని న‌డిపించిన విధానంలో ఎక్క‌డా ప‌రిణ‌తి లేదని చెప్పకతప్పదు.

ఎవ‌రెలా నటించారంటే.. Tiger Nageswara Rao Movie Review

టైగర్ నాగేశ్వర్ రావు సినిమాకు ర‌వితేజ న‌ట‌న ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని చెప్పాలి. రెగ్యులర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో క‌నిపించిన‌ట్టుగా కాకుండా, గ‌త సినిమాలకు కాస్త భిన్నంగా నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో ఒదిగిపోయాడు రవితేజ. హీరోయిన్లు నుపుర్ స‌న‌న్‌, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్  త‌మ పాత్ర‌ల‌ పరిధిమేరకు నటించారు. అనుప‌మ్ ఖేర్‌, ముర‌ళీశ‌ర్మ‌, నాజ‌ర్ త‌దిత‌రులు వారి వారి పాత్రల మేరకు నటించారు. చాలా కాలం తరువాత నటించిన రేణుదేశాయ్‌ చేసిన హేమ‌ల‌తా ల‌వ‌ణం పాత్ర తెర‌పై ఏ మాత్రం ఆకట్టుకోదు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ప్రధానంగా జీవీ ప్ర‌కాశ్‌ కుమార్ సంగీతం చిత్రానికి బలం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో త‌న‌దైన ప్ర‌భావం చూపించారు. కెమెరా, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ విభాగాలు మంచి ప‌నితీరుని ప్రదర్శించాయి. మొత్తానికి టైగర్ నాగేశ్వర్ రావు ప్రేక్షకులను అనుకున్నంత ఆకట్టుకోలేకపోయిందని చెప్పకతప్పదు.

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2.5/5

 

Note- ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Tiger Nageswara Rao Movie Review


Comment As:

Comment (0)