Kishan Reddy

ఇందిరాపార్క్ దగ్గర కిషన్ రెడ్డి దీక్ష భగ్నం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ రిపోర్ట్-  కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డిని (Kishan Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ (Indira Park) దగ్గర దీక్ష చేస్తున్న కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం దగ్గర వదిలిపెట్టారు. ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా 24 గంటల నిరాహార దీక్షను చేపట్టారు కిషన్ రెడ్డి. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష గురువారం ఉదయం 11 గంటల వరకు కొనసాగించాలని కిషన్ రెడ్డి నిర్ణయించారు. ఐతే సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దీక్షకు అనుమతి ఉందని పోలీసులు కిషన్ రెడ్డి దీక్షను విరమించాలని కోరారు. ఐతే తాను గురువారం ఉదయం 11 గంటల వరకు దీక్ష చేసి తీరుతానని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో జరిగిన తోపులాటలో ఆయన కింద పడిపోయారు. కిషన్ రెడ్డి తో పాటు, బీజేపీ నేతలను అరెస్టు చేయడానికి భారీగా పోలీసులు మోహరించారు. కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుండా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్బంగా పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలు, మహిళా కార్యకర్తలు కింద పడిపోయారు. పోలీసులకు, బీజేపీ క్యాడర్ మధ్య తోపులాటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపు సొమ్మసిల్లిపోయారు. పోలీసులకు, బీజేపీ క్యాడర్ కు మధ్య తీవ్ర తోపులాట మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసిని పోలీసులు, ఆయనను నాంపల్లి పార్టీ కార్యాలయంలో దిగబెట్టారు.


Comment As:

Comment (0)