Titan-submersible

టైటాన్ శబ్దాలను గుర్తించిన కెనడా నిఘా విమానం

అట్లాంటిక్‌ సముద్రంలో టైటాన్ శబ్దాలను గుర్తించిన కెనడా నిఘా విమానం

ఇంటర్నేషనల్ డెస్క్- సుమారు 111 ఏళ్ల క్రితం మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్‌ అనే మినీ జలాంతర్గామి ఆచూకీ కనుగొనే క్రమంలో పురోగతి కనిపించింది. కెనడాకు చెందిన అత్యాధునిక పీ8 నిఘా విమానం గాలింపు చర్యలు చేపట్టగా, సముద్రం అడుగున కొన్ని రకాల శబ్దాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌ గార్డ్‌ లోని నార్త్‌ ఈస్ట్‌ కమాండ్‌ తెలిపింది. అంతే కాకుండా అమెరికా డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ మెమోను ఉటంకిస్తూ కెనడా విమానం సముద్రంలో శబ్దాలను గుర్తించిందని అమెరికా పత్రికలు వార్తలను ప్రచురించాయి. సుమారు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి సముద్రం లోతుల్లోంచి ఈ శబ్ధాలు వస్తున్నట్లు కెనడా విమానం గుర్తించిందని స్పష్టం చేశాయి. 

టైటాన్ మినీ జలంతర్గామి కోసం సుమారు మూడు రోజులుగా సాగుతున్న గాలింపు చర్యల్లో ఇది కీలక పరిణామంగా చెబుతున్నారు. ఈ ఘటన నేపధ్యంలో అమెరికా తన గాలింపు బృందాలు, అదనపు నౌకలు, పరికరాలను ఆ ప్రదేశంలో మోహరిస్తోంది. ఐతే నాలుగు గంటల పాటు వెలువడిన శబ్దాలు ఆ తరువాత ఆగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అదనపు గాలింపు చర్యల్లో మళ్లీ శబ్దాలు వినిపించలేదని.. ప్రతికూల ఫలితాలు వచ్చాయని నార్త్‌ ఈస్ట్‌ కమాండ్‌ తెలిపింది. మినీ జలంతర్గామి టైటాన్ ను గుర్తించేవరకు తమ గాలింపు చర్యలు అక్కడ కొనసాగుతాయని స్పష్టం చేసింది. 

టైటానికి షిప్ శకలాలలను చూసేందుకు వెళ్లిన టైటాన్ జలాంతర్గామిలో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్, సాహసయాత్రికుడు హమీష్‌ హార్డింగ్‌, పాకిస్థాన్‌ బిలియనీర్‌ షాజాదా దావూద్‌, ఆయన కుమారుడు సులేమాన్‌ తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జలాంతర్గామిలో కేవలం మరో 30 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే మిగిలి ఉంటుందని అంచనా వేస్తున్న నిపుణులు.. అంతలోపు వారిని రక్షించే లక్ష్యంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
 


Comment As:

Comment (0)