Vimanam

విమానం- సినిమా రివ్యూ.. అనసూయ ఆ పాత్రలో

సినిమా- విమానం

తారాగణం- స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ- వివేక్ కాలేపు 

ఎడిటింగ్‌- మార్తాండ్ కె.వెంక‌టేష్‌ 

సంగీతం- చ‌ర‌ణ్ అర్జున్‌

పాట‌లు- చరణ్ అర్జున్‌ 

మాటలు- హ‌ను రావూరి

నిర్మాణం- జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం- శివ ప్ర‌సాద్ యానాల‌

విడుదల‌- 09-06-2023

పరిచయం....

ఎండాకాలంలో పెద్ద హీరోల సినిమాలు పెద్దగా విడుదల కాలేదు. ఈ నేపధ్యంలో ప్రతి వారం చిన్న బడ్జెట్ సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఈ సీజ‌న్ చిన్న సినిమాల‌కి ఓ మంచి అవకాశాలను కల్పిస్తోంది. ఈ వారం రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో విమానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తండ్రీ కొడుకుల క‌థ‌తో తెలుగు, తమిళ భాష‌ల్లో రూపొందించారు విమానం సినిమాను.

కధ....

ఇక విమానం కధలోకి వెళ్తే.. అంగవైకల్యం ఉన్నప్పటికీ క‌ష్ట‌పడి ప‌నిచేసే వ్య‌క్తి వీర‌య్య (సముద్ర‌ఖ‌ని). తన భార్య చనిపోవడంతో త‌న కొడుకు రాజు (ధ్రువ‌న్‌)తో క‌లిసి ఓ చిన్న బ‌స్తీలో నివసిస్తూ ఉంటాడు. దగ్గర్లోని ఆటోస్టాండ్ ద‌గ్గ‌ర మ‌రుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌తో వ‌చ్చే చాలీ చాల‌ని సంపాద‌నతో తాను, తన కొడుకు జీవిస్తూ ఉంటారు. స్కూల్ కు వెళ్లే రాజుకి విమానం అంటే ఎంతో ఇష్టం. పెద్ద‌య్యాక తాను పైలట్ కావాల‌ని క‌ల‌లు కంటూ ఉంటాడు రాజు. ఈ క్రమంలో అనుకోకుండా రాజు నెల రోజుల్లోనే విమానం ఎక్కించాల్సిన అవ‌స‌రం వచ్చిపడుతుంది. త‌న వినానం ఎక్కాలన్న తు కొడుకు కోరిక‌ని తీర్చేందుకు ఆ తండ్రి ఏం చేశాడు, అసలు నెల రోజుల్లోనే విమానం ఎక్కించాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింది, ఇంతకీ కొడుకును విమానం వీరయ్య విమానం ఎక్కించాడా అన్నదే ఈ సినిమా కధ. ఆ బ‌స్తీలోనే ఉండే సుమ‌తి (అన‌సూయ‌), కోటి (రాహుల్ రామ‌కృష్ణ‌), డేనియ‌ల్ (ధ‌న్‌రాజ్‌)ల జీవితాలకు వీరయ్య కుటుంబానికి సంబంధం ఏంటీ అన్నది ఇక సినిమాలో చూడాల్సిందే...

విమానం ఎలా ఉంది...

విమానం తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే భావోద్వేగాల కధనం. త‌న కొడుకు కోరిక‌ని తీర్చే క్ర‌మంలో ఓ తండ్రి జీవితంలోని సంఘ‌ర్ష‌ణ‌ని హృద‌యాల‌కి హ‌త్తుకునేలా చూపించాడు డైరెక్టర్. అందరిని టచ్ చేసేలా, ఈజీగా కనెక్ట్ అయ్యేలా కధను రాసుకున్నాడు. క‌థలో ఎక్కువ భాగం ఎక్కువ‌గా వీర‌య్య‌, అత‌ని కొడుకు రాజు చుట్టూనే తిరగడంతో కొంత పరిమితికి లోనవుతారు ప్రేక్షకులు. సినిమాలో మిగిలిన పాత్ర‌లకు పెద్దగా ప్రాధాన్యం లేదని అనిపిస్తుంది. ఇక విమానం సినిమా క‌థ‌, క‌థ‌నాలు చూసేవాళ్లలో పెద్దగా ఆస‌క్తిని కలిగించవు. సుమారు 30 ఏళ్ల క్రితం హైద‌రాబాద్‌ లో విమానాశ్ర‌యం బేగంపేట్ నుంచి శంషాబాద్‌కి మారిన సమయంలోని కధ. రాజుకి విమానంపై ఉన్న ఇష్టం, ఎక్కాలన్న కోరికతో అత‌ను వేసే ప్ర‌శ్న‌లు, స్కూల్లో త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి విమానం గురించి చెప్పుకొనే కబుర్లు ఆలరిస్తాయి. ఎయిర్ పోర్ట్ లో వీర‌య్య‌, రాజుల మ‌ధ్య జరిగే ప‌తాక సన్నివేశాలు అందరిని కదిలిస్తాయి. మీరా జాస్మిన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించారు.

ఎవరు ఎలా నటించారంటే...

సముద్రఖని విక‌లాంగుడైన తండ్రి పాత్ర‌లోచక్కగా ఒదిగిపోయాడు. కొడుకు కోరిక‌ తీర్చే సందర్బంలో ఎదుర‌య్యే ఇబ్బందులు, భావోద్వేగాలు, అందులో ఆయ‌న న‌ట‌న ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటుంది. కొడుకుగా నటించిన మాస్ట‌ర్ ధ్రువ‌న్‌ తోపాటు, డేనియ‌ల్ త‌న‌యుడిగా న‌టించిన మ‌రో చిన్నారి చాలా బాగా అలరించారు. సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ పరవాలేదనిపించింది. ఇక రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్ వారి వారి పాత్ర‌ల మేర‌కు న‌టించారు. సంగీతం సినిమాకి ప్ర‌ధాన బ‌లం అని చెప్పాలి. ఆయా సన్నివేశాల సందర్బంగా వ‌చ్చే పాట‌లు, వాటిలోని సాహిత్యం అర్థ‌వంతంగా ఉంది. సినిమాటోగ్రఫీ బావుంది. మాట‌లు భావోద్వేగాలను పండించాయి. మరీ ముఖ్యంగా అన‌సూయ పాత్ర ప‌లికే సంభాష‌ణ‌లు ఆలోచింపజేస్తాయి. డైరెక్టర్ శివ ప్ర‌సాద్ రాసుకున్న క‌థ‌లో భావోద్వేగాలు ఉన్నప్పటికీ, కధలో కొత్తదనం లేదని అనిపిస్తుంది. మొత్తానికి విమానం సినిమా గాల్లోకి ఎగరలేకపోయింది.

 

Note-ఈ సమీక్ష కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


Comment As:

Comment (0)