CM Revanth TS

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారభేరి

పొలిటికల్ రిపోర్ట్- తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపధ్యంలో ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందులో భాగంగా వీలునుబట్టి జాతీయస్థాయి నేతలు రాష్ట్రంలో ప్రచారానికి వస్తున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్‌ లో కాంగ్రెస్ అభ్యర్ధి చల్లా వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇక సాయంత్రం మహబూబాబాద్‌ బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు.

అటు ఈనెల 20 మెదక్‌ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు హాజరవుతారు సీఎం రేవంత్ రెడ్డి. అదే రోజు సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారు. నెల 21 భువనగిరిలో పార్టీ అభ్యర్ధి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈనెల 22 ఆదిలాబాద్‌ లో, 23 నాగర్‌ కర్నూల్‌లో, 24 ఉదయం జహీరాబాద్‌, సాయంత్రం వరంగల్‌ లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

వచ్చే నెల మే 11 ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోగా వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. వీలుని బట్టి ప్రతి లోక్‌ సభ నియోజకవర్గంలో 2 నుంచి 3 సభల్లో రేవంత్ రెడ్డి ప్రచార సభలను ఏర్పాటుచేసే విధంగా పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభలను సక్సెస్ చేయడానికి అభ్యర్థులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

 


Comment As:

Comment (0)