KCR Tamilisai

సచివాలయంలో ఆలయం, మసీదు, చర్చిలను ప్రారంభించిన సీఎం

సచివాలయ నిర్మాణం గొప్పగా ఉంది - గవర్నర్ తమిళిసై ప్రశంస 

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ నూతన సచివాలయంలో కొత్తగా నిర్మించిన ప్రార్ధనా మందిరాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సెక్రెటరియేట్ ఆవరణలోని నల్ల పోచమ్మ ఆలయం, చర్చి, మసీదులను శుక్రవారం గవర్నర్‌ తమిళిసై (Tailisai) తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించారు. నల్లపోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పూర్తయిన తరువాత సీఎం కేసీఆర్, గవర్నర్‌ తమిళిసై తో కలిసి చర్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వారికి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఇతర ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. గవర్నర్‌ తమిళిసై రిబ్బన్‌ కట్‌ చేయగా, సీఎం కేసీఆర్‌, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు చర్చిలో అడుగుపెట్టారు. బైబిల్‌ పఠనం తరువాత గవర్నర్ కేక్ కట్ చేశారు. ఆ తర్వాత తర్వాత సీఎం, గవర్నర్‌ పక్కనే నిర్మించిన మసీదుకు చేరుకున్నారు. వీరికి ఇస్లాం సంప్రదాయ పద్ధతిలో ఇమామ్‌, తదితర మత పెద్దలు స్వాగతం పలికారు.  అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ప్రార్ధనా మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమం తరువాత సెక్రెటరియేట్ (TS Secretariat) లోపలికి గవర్నర్‌ తమిళిసై ను సీఎం తన కారులో తీసుకుని వెళ్లారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, సీఎస్‌ శాంతికుమారి గవర్నర్ కు బొకే అందించి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సచివాలయ ప్రాంగణమంతా కలియతిరుగుతూ గవర్నర్‌ కు ఒక్కో అంతస్తు గురించి వివరించారు. ఆ తరువాత తన ఛాంబర్‌ లో గవర్నర్ ను శాలువాతో సత్కరించారు. సీఎస్‌ శాంతి కుమారి చీర, సారెలతో సంప్రదాయబద్ధంగా తమిళిసైను ఘనంగా సన్మానించారు. సచివాలయ నిర్మాణం గొప్పగా ఉందని ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు.


Comment As:

Comment (0)