EX CM KCR

కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ మాస్ వార్నింగ్

రైతులను ఆదుకోకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు - కేసీఆర్‌

తెలంగాణ రిపోర్ట్- కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం కాంగ్రెస్ (Congress) విధానాల వల్లే రాష్ట్రంలో రైతులు కష్టాలు అనుభవిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో పంటలు ఎండిపోయాయని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న రైతులను, చేనేత కార్మికుల్ని ఆదుకోకపోతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్, ఆ తరువాత సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఈ సందర్బంగా కేసీఆర్ చెప్పారు. నీటి నిర్వహణ గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోయాయని కేసీఆర్ మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరవా? కాంగ్రెస్‌ తెచ్చిన కరవా? అని ప్రశ్నించారు.

మరోలైపు రైతు బంధుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక దశ దిశా లేదని కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో అన్న వస్త్రం కోసం పోతే.. ఉన్న వస్త్రం ఊడినట్లుగా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద రోజుల్లో మొత్తం 209 మంది రైతులు చనిపోయారన్న కేసీఆర్.. నాలుగు గంటల్లోనే సీఎస్‌కు అందుకు సంబందించిన వివరాలు పంపామని చెప్పారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే 1.80 శాతం మాత్రమే కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయని.. మీ మోసపూరిత హామీలు చూసి ప్రజలు మోసపోయారని చెప్పారు కేసీఆర్.

కాళేశ్వరంలో (Kaleshwaram) వీలైనంత త్వరగా పూర్తి చేసి నీళ్లివ్వాలని ఆరాటపడ్డామని చెప్పిన కేసీఆర్.. 6 నెలలు తపస్సు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశామని అన్నారు. మేడిగడ్డ వద్ద 300 పిల్లర్లు నిర్మించామని.. అందులో 3 పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే మునిగిపోయినట్లు కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో నాలుగు నెలలు ఆగామన్న కేసీఆర్.. ఇక ఊరుకునేది లేదని హెచ్చరించారు.


Comment As:

Comment (0)